వైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగ

బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు. ఇలా ఆ రాష్ట్రంలో ఊహించని విధంగా…

బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు. ఇలా ఆ రాష్ట్రంలో ఊహించని విధంగా దొంగతనాలు జరుగుతుంటాయి. అయితే ఓ దొంగ మాత్రం అందరికీ తెలిసిన సంప్రదాయ పద్ధతిలో దొంగతనం చేయబోయి, అడ్డంగా దొరికిపోయాడు.

భాగల్పూర్ రైల్వేస్టేషన్… డీఎంయూ ప్యాసింజర్ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. రైళ్లో కిటికీ పక్కన కూర్చొని ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతోంది. స్టేషన్ బయట ఓ దొంగ తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. అతడు ఏం చేయబోతున్నాడో మనం అంచనా వేయొచ్చు.

మనందరి ఊహకు తగ్గట్టే అతడు రియాక్ట్ అయ్యాడు. రైలు ఇలా కదలడమే ఆలస్యం, చటుక్కున పరుగెత్తుకుంటూ వచ్చాడు. కిటికీ లోంచి యువతి ఫోన్ ను లాక్కొని పారిపోవాలనేది అతడి ప్లాన్. అనుకున్నట్టుగానే అంతా పక్కాగా అమలు చేశాడు, కానీ ఊహించని విధంగా దొరికిపోయాడు.

కిటికీ లోంచి యువతి ఫోన్ లాక్కోవడానికి రెడీ అయిన దొంగను, మరో సీటులో ఉన్న వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు. దొంగ ఎప్పుడైతే కిటికీలోంచి చేయి లోపలికి పెట్టాడో, ఠక్కున ఆ చేయి పట్టుకున్నాడు ట్రయిన్ లో ఉన్న వ్యక్తి.

అంతే, దొంగ విలవిల్లాడిపోయాడు. మరోవైపు ట్రయిన్ స్పీడ్ అందుకుంది. తనను వదిలేయొద్దని, వదిలేస్తే ట్రయిన్ కింద పడి చనిపోతానని ప్రాధేయపడ్డాడు. అలా అతడ్ని కిటికీలోంచి పట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లారు ప్రయాణికులు. ఆ ప్రయాణంలోనే అతడికి దేహశుద్ధి కూడా అయిపోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. అదే రైలులో దొంగకు చెందిన గ్యాంగ్ కూడా ఉంది.