తమ్ముడి ఫలితాన్ని బట్టి అన్న నిర్ణయం?

భువనగిరి ఎంపీ, మునుగోడులో బీజేపీ అభ్యర్థి అన్న కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానం కూడా వెంకట…

భువనగిరి ఎంపీ, మునుగోడులో బీజేపీ అభ్యర్థి అన్న కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానం కూడా వెంకట రెడ్డిపై కఠినంగా వ్యవహరించడంలేదని అనిపిస్తోంది. మునుగోడులో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏం చేశాడనేది అందరికీ తెలిసిందే.   

మునుగోడు వెంకటరెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ తరపున మునుగోడులో ప్రచారంలో పాల్గొన లేదు. అదే సమయంలో ఒక ఆడియో కాల్ లో పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసి తమ్ముడు రాజగోపాల్ గెలుపుకు సహకరించాలని కోరాడు. 

ఆ వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిన వెంకటరెడ్డి అక్కడ కూడా ఇదే రకంగా వ్యాఖ్యలు చేశాడు. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని చెప్పాడు. టీఆర్ఎస్ -బీజేపీ డబ్బు పెడుతున్నాయని, ఓడిపోయే పార్టీ కోసం ప్రచారం ఎందుకని అన్నాడు. వెంకటరెడ్డి ఆడియో వైరల్ కావటంతో, దీని పైన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నోటీసు జారీ చేసింది. 

అక్టోబర్ 22న నోటీసు జారీ చేస్తూ, ఆడియో కాల్ లో చేసిన వ్యాఖ్యల పైన వివరణ కోరింది. ఎందుకు పార్టీ క్రమ శిక్షణా చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. దానికి పది రోజుల సమయం ఇచ్చింది. ఆ సమయం ఈ నెల 1వ తేదీతో ముగిసింది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఆ నోటీసుకు వివరణ ఇవ్వలేదని పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం.

తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేదు. అటు అధిష్టానం నోటీసుకు వివరణ ఇవ్వకుండా ఇటు జోడో యాత్రలో పాల్గొనకుండా ఉండటంతో ఆయన మీద సందేహాలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? తమ్ముడి బాటలో కాషాయం పార్టీలోకి వెళతాడా? అనే డౌట్ వస్తోంది. 

ఇప్పుడు ఇదే సమయంలో పార్టీ క్రమశిక్షణా సంఘం మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని  క్రమశిక్షణ కమిటీ ఈ  స్పష్టం చేసింది. అంటే రెండోసారి అవకాశం ఇచ్చిందన్నమాట. అంటే ఆయన పట్ల కఠినంగా వ్యవహరించడంలేదని అర్ధమవుతోంది. 

ఈ నోటీసుకు సమాధానం రాకుంటే, వెంకటరెడ్డి పైన చర్యలకు అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన సంగతి తెలిసిందే కదా. .ఈ నెల 6వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితం  రాజగోపాల్ కు అనుకూలంగా ఉంటే వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఫలితం ప్రతికూలంగా ఉంటే, వెంకటరెడ్డి ఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత వివాదం పరిష్కరించుకొనే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.