నాలుగు సార్లు చెప్పారుట… పవనే సీఎం అని…

ఏపీలో పొత్తుల గురించి చర్చ గట్టిగానే జరుగుతోంది. టీడీపీ జనసేనల మధ్య పొత్తులు ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పొత్తులు ఉంటే ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్నది కూడా…

ఏపీలో పొత్తుల గురించి చర్చ గట్టిగానే జరుగుతోంది. టీడీపీ జనసేనల మధ్య పొత్తులు ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పొత్తులు ఉంటే ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మధ్యనే రాజమండ్రీలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కాపుల మద్దతు కోరుతున్నారని విమర్శించారు.

దానికి  జవాబు అన్నట్లుగా జనసేన పార్టీకి చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా ఒక టీవీ చానల్ లో ప్రవాసాంధ్రుల కార్యక్రమంలో మాట్లాడుతూ కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా అదే బదులు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే నాలుగు సార్లు తానే సీఎం అభ్యర్ధిని అని స్పష్టంగా తెలిపారు అని బొలిశెట్టి పేర్కొన్నారు.

ఇంత క్లారిటీగా తమ పార్టీ అధినాయకుడు తానే సీఎం అవుతాను అని చెప్పాక కూడా ఎవరో పల్లకీ జనసేన మోస్తుందనడం సరికాదు అని బొలిశెట్టి అంటున్నారు. వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అని కాదు కానీ నిజంగా ఆలోచిస్తే ఏపీలో టీడీపీ పెద్ద పార్టీ, చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. ఆయనతో పొత్తు అంటే కచ్చితంగా బాబే సీఎం అని ఎవరైనా చెబుతారు. జనసేన నాయకులు మాత్రం పవన్ సీఎం గా ఉంటారు అనే గట్టిగా చెబుతున్నారు. మరి అది ఎలా జరుగుతుందో వారే చెప్పాలి.

ఈ విధంగా ఎన్నికలు అయ్యేంతవరకూ చెప్పి ఆనక బాబునే సీఎం చేసే ప్రతిపాదన ఏదైనా తెర వెనక ఉందా అన్న డౌట్లను వైసీపీ నేతలు ఇపుడు వ్యక్తం చేస్తున్నారు. కాపుల ఓట్ల కోసం పవనే సీఎం అని ముందుకు తెస్తారని ఆ మీదట సీఎం అయ్యేది పక్కాగా బాబే అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తమ నాయకుడిని సీఎం అవమని ప్రత్యర్ధి పార్టీలు కోరితే ఎక్కడ లేని కోపాలూ జనసేన నాయకులకు రావడమే రాజకీయ విడ్డూరం అంటున్నారు.