టైటిల్: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్
రేటింగ్: 1.5/5
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజి, రఘుబాబు, సుదర్శన్, గోవింద్ పద్మసూర్య, మైం గోపి తదితరులు
కెమెరా: వసంత్
ఎడిటింగ్: రాం తూము
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: మేర్లపాక గాంధి
విడుదల తేదీ: 4 నవంబర్ 2022
“ఏక్ మిని కథ”, “మంచి రోజులొచ్చాయ్” లాంటి సినిమాలతో ఒక వర్గం ప్రేక్షకులకు దగ్గరైన సంతోష్ శోభన్, “జాతిరత్నాలు” ఫేం ఫారియా అబ్దుల్లా కలిసి నటించిన చిత్రమిది. తన సినిమాల్లో ఏదో ఒక వెరైటీ పాయింట్ ఉండేలా చూసుకునే మేర్లపాక గాంధి దర్శకుడు. ఇంతకీ ఇందులో బాగోగులు ఎలా ఉన్నాయో చూద్దాం.
వసుధ పేరుమోసిన యూట్యూబ్ వ్లాగర్. ఆమెకి 3 మిలియన్ల పైన సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆమె అభిమానుల్లో ఒకడు విప్లవ్. అతను కూడా వ్లాగ్ మొదలుపెడతాడు. వీరిద్దరిదీ ఒక ట్రాక్. మరో పక్క అడవిలో అన్నలకి పోలీసులకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. అయితే అనుకోని విధంగా ఈ వ్లాగర్ జంట పోలీసులకి, అడవిలో అన్నలకి మధ్యలో ఎలా నలిగారనేది కథ. ఇదంతా లైటర్ వీన్లో కామెడీ టచ్ తో తీసే ప్రయత్నమైతే జరిగింది కానీ పెద్దగా రక్తికట్టించడమైతే జరగలేదు.
అసలిది అడవిలో అన్నల కాలం కాదు. కథలోనే నాన్ సింక్ కొట్టే అంశమిది. 1990 ఫ్లాష్ బ్యాకులో ఒక సీన్ పెట్టారంటే అర్థముంది. కానీ దానికి కొనసాగింపుగా ఇప్పటికీ నక్సలిజం యాక్టివ్ గా ఉన్నట్టు చూపించడం కథలో లోపం. అయితే ఆ అన్నల్ని కూడా కామెడీగా చూపించడం వల్ల ఫార్స్ కామెడీగా అనిపించి కొంత వరకు దోషం తగ్గింది. ఇదంతా సిల్లీకామెడీ అనుకుని సరిపెట్టుకుని చూడాలంతే.
ప్రధమార్థంలో హీరో హీరోయిన్స్ కలిసే సీన్ అత్యంత పేలవంగా ఉంది. హీరో చేత ఫ్యాన్ మొమెంట్స్ పలికించలేకపోయాడు దర్శకుడు. అలాగే సుదర్శన్ కెమెరామన్ గా హీరో కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బోరు కొట్టిస్తాయి. ఆ మాత్రం కమెడియన్ ని పెట్టుకుని కనీసమైన ట్రాక్ కూడా రాసుకోకపోవడం పెద్ద లోపం.
కథనంలో ముప్పావుగంటవరకు అసలు కాన్ ఫ్లిక్ట్ పాయింటే కనపడదు. షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్ కి తక్కువ అన్నట్టుగా సా..గుతుంటుంది.
ఉన్నంతలో బ్రహ్మాజీయే కాస్త రిలీఫ్ అనిపిస్తాడు. అలాగని అదేమీ అంత అద్భుతమైన కామెడీ అని కాదు. ఇంతకన్నా గొప్పవి ఈ నటుడు గతంలో చాలా చేసేసాడు.
ఇంటర్వెల్ సీన్లో రఘుబాబు “నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు..టెన్షన్ గా ఉంది” అంటాడు. నిజానికక్కడ టెన్షన్ పడేంత సీనే లేదు. అంత దయనీయంగా ఉంది ఫస్టాఫ్.
ఫస్టాఫుతో పోలిస్తే సెకండాఫు ఇంకాస్త ఓపిక పరీక్షిస్తుంది. అక్కడక్కడే తిరుగుతూ చిన్న కథని 2 గంటలకు పైగా ఎలా లాగాలో తెలీక పడే దర్శకుడి ఇబ్బంది కనిపిస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చే సరికి ట్విస్టులున్నాయి. అదొక్కటీ పర్వాలేదనుకుందామనుకున్నా అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు.
టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగులు ఓకే. సంగీతం రొటీన్. కొత్తగా ఉందనిపించేలాగా ఏదీ లేదు. ఈ సినిమాలో ప్రధానమైన మైనస్ ఏదైనా ఉందా అంటే అది పేలవమైన కథా, కథనాలే. దర్శకుడిగా గాంధీ మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
శోభన్ ఎప్పటిలాగానే ఈజ్ తో చేసాడు. పాత్రని మాస్ హీరోగా మలచకుండా తన పర్సనాలిటీకి, ఇమేజ్ కి తగ్గట్టుగా నడపడం బాగుంది.
ఫారియా అబ్దుల్లా ఓకే. కాస్త కామెడీ కొంచెం సెంటిమెంట్ కలగలిపిన పాత్ర తనది. బ్రహ్మాజీ తనశైలి కామెడీ చేసినా తన టీములో ఉన్న మిగతా జనం మాత్రం సరైన ట్రాక్ పడక విసిగిస్తారు. సుదర్శన్ పాత్ర చిన్న చిన్న రియాక్షన్స్ తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే అతని పాత్ర వేష్టయ్యింది.
ఓవరాల్ గా ఈ సినిమా పూర్తిస్థాయి సంతృప్తినైతే ఇవ్వదు. కాబట్టి టైటిల్లో చెప్పినట్టు మూడింటిలో ఒక్కటైనా చేయడం కష్టమే .
బాటం లైన్: నో లైక్, నో షేర్, నో సబ్‌స్క్రైబ్