ఈటెల, రేవంత్ ఇద్దరు దొంగలే!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌ రాజ‌కీయం మొత్తం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ల‌ చుట్టూనే తిరుగుతోంది. ఈటెల, రేవంత్ మాట‌ల యుద్దంలోకి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్…

తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌ రాజ‌కీయం మొత్తం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ల‌ చుట్టూనే తిరుగుతోంది. ఈటెల, రేవంత్ మాట‌ల యుద్దంలోకి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎంట‌ర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, ఈటెల ఇద్ద‌రూ దొంగలేనని.. ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయని ఆరోపించారు. 

కాగా ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీని.. రేవంత్ ను ఈట‌ల రాజేంద‌ర్ రూ.25కోట్ల‌కు కొన్నార‌ని.. ఆ లెక్క‌ల్లో తేడా వ‌చ్చినందు వ‌ల్ల ఇప్పుడు బ‌య‌ట వేసుకుంటున్నారన్నారు. బీజేపీలో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈటల సహనం కోల్పోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఈటలకు హుజూరాబాద్ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిప‌డ్డారు. 

కాగా ఇటీవ‌ల ఈటెల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటేనని, ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు వంటివని.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకీ బీఆర్‌ఎస్‌ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని, తాను చెప్పింది అబద్ధమని గుండెలపై చేయివేసుకుని చెప్పాలని డిమాండ్ చేయ‌డం తెలిసిందే.

ఈటెల వ్యాఖ్య‌ల‌పై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ లేదా కేసీఆర్‌ నుంచి డబ్బులు తీసుకోలేదని తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. తన ఆరోప‌ణ‌ల‌పై ఈట‌ల రాజేంద‌ర్ కూడా వ‌చ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ నుండి బ‌య‌ట వ‌చ్చిన త‌ర్వాత ఈటెల కాంగ్రెస్ పార్టీని ఇంత స్థాయిలో విమర్శ‌లు చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గమనార్హం.