వైఎస్సార్‌, చంద్ర‌బాబు అభిమానుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు…!

ఒక‌వైపు సీఎం కేసీఆర్‌, ఆయ‌న మేన‌ల్లుడైన మంత్రి హ‌రీష్‌రావు ఆంధ్రా నాయ‌కులతో పాటు ఆ ప్రాంతంపై నిత్యం విషం చిమ్ముతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు సీమాంధ్రుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు…

ఒక‌వైపు సీఎం కేసీఆర్‌, ఆయ‌న మేన‌ల్లుడైన మంత్రి హ‌రీష్‌రావు ఆంధ్రా నాయ‌కులతో పాటు ఆ ప్రాంతంపై నిత్యం విషం చిమ్ముతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు సీమాంధ్రుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ మాయ మాట‌లు చెబుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ  25 ఏళ్లలో వెనక్కి చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులే గుర్తొస్తార‌ని చెప్పుకొచ్చారు. ఆ ముగ్గురు ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, కేసీఆర్ అని ఆయ‌న చెప్పారు. ఈ ముగ్గురు హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రంపై త‌మ‌దైన ముద్ర వేయ‌గ‌లిగార‌ని ఆయ‌న అన్నారు.

చంద్ర‌బాబు పాల‌న వ్యాపార‌, ఐటీ రంగం,ప‌ట్ట‌ణీక‌ర అభివృద్ధికి అనుకూలంగా సాగింద‌న్నారు. వీటిలో ఆయ‌న‌కు ఇమేజ్ వుండింద‌న్నారు. వైఎస్సార్ ప‌రిపాల‌న చూస్తే…గ్రామీణ‌, వ్య‌వసాయ రంగం అభివృద్ధికి కృషి చేసిన పాల‌కుడిగా, పేద‌ల ప‌క్ష‌పాతిగా ఇమేజ్ తెచ్చుకున్నార‌న్నారు. కేసీఆర్‌ను చూస్తే…వారిలోని రెండూ క‌నిపిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇటు వైఎస్సార్‌, అటు చంద్ర‌బాబునాయుడి అభిమానుల ఆద‌ర‌ణ చూర‌గొనేందుకే కేటీఆర్ ఆ ఇద్ద‌రు నాయ‌కుల గురించి మంచిగా మాట్లాడార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అస‌లు ఏపీ పాల‌కుంటేనే అస‌హ్యించుకునే సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీష్‌రావు ఒక‌వైపు, వాళ్ల దెబ్బ‌ల‌కు గాయ‌ప‌డిన వారికి మందు పూస్తే కేటీఆర్ మ‌రోవైపు ఉన్నార‌ని ప్ర‌జానీకం గుర్తించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బీఆర్ఎస్ నేత‌లు ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడుతూ రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని జ‌నం గ్ర‌హించార‌ని అంటున్నారు. చంద్ర‌బాబు, వైఎస్సార్‌ల‌పై కేటీఆర్ ప్ర‌శంస‌లు కేవ‌లం ఎన్నిక‌ల కోణంలో చూడాల‌నే వాళ్ల సంఖ్య ఎక్కువ‌గా వుంది.