డొంకతిరుగుడు జవాబుల్లో కేటీఆర్ దిట్ట!

గట్టిగా మాట్లాడగలిగే తెగింపు ఉండాలి.. తాము చెబుతున్నది నిజమేనా? అబద్ధమా? అనే పట్టింపు అక్కర్లేదు.. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగల ధైర్యం ఉండాలి.. మాటల దూకుడుతో ఎదుటివారిని హడలగొట్టగల నేర్పు ఉండాలి.. ఇక రాజకీయాల్లో…

గట్టిగా మాట్లాడగలిగే తెగింపు ఉండాలి.. తాము చెబుతున్నది నిజమేనా? అబద్ధమా? అనే పట్టింపు అక్కర్లేదు.. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగల ధైర్యం ఉండాలి.. మాటల దూకుడుతో ఎదుటివారిని హడలగొట్టగల నేర్పు ఉండాలి.. ఇక రాజకీయాల్లో చెలరేగిపోతుండవచ్చు. అలాంటి లక్షణాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన ముద్ర చూపించే వ్యక్తి కాగా, మంత్రి కేటీఆర్ ….. తండ్రిని మించిన తనయుడిగా చెలరేగుతున్నారు. 

అసెంబ్లీలో ఆయన వాక్చాతుర్యాన్ని ప్రత్యక్షంగా గమనించి తీరాల్సిందే. డొంకతిరుగుడు జవాబులలో తాను దిట్ట అని నిరూపించుకుంటున్నారు.
 
ప్రతిపక్షనాయకులు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ ఇస్తున్న సమాధానాలు చాలా దూకుడుగా ఉంటాయి. అద్భుతమైన వాగ్ధాటి, చాతుర్యంగా మాట్లాడగల నేర్పు ఉంటాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క.. తెలంగాణలో పంచాయతీలకు ప్రభుత్వం నిధులు అందించే విషయాన్ని ప్రస్తావించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు భారీగా నిధులు ఇస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పారని.. కానీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని అన్నారు. చిన్న పంచాయతీలు అయితే పదిహేను లక్షలు, మేజర్ పంచాయతీలు అయితే పాతిక లక్షల వంతున ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గుర్తుచేశారు. ఆ నిధులు వస్తాయనే నమ్మకంతా.. ఏకగ్రీవంగా ఎన్నికైన అనేక పంచాయతీల్లో సర్పంచులు పనులు చేయించేశారని.. నిధులు రాకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారని సమస్యను ప్రస్తావించారు. గ్రామాల్లో పనులు జరగడం లేదని ఆయన అన్నారు.

ఈ విషయానికి కేటీఆర్ సమాధానం గమనిస్తే.. డొంకతిరుగుడు జవాబుల్లో ఆయన తెలివితేటలు మనకు అర్థం అవుతాయి. గ్రామాల్లో పనులు జరగడం లేదు అనే మాటను మాత్రమే కేటీఆర్ పట్టుకున్నారు. 

ఒకవైపు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని భట్టి అంటున్నారని, అదే సమయంలో అసలు పనులే జరగలేదని కూడా అంటున్నారని.. ఈ కాంట్రడిక్షన్ నుంచి ముందు ఆయన బయటకు రావాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అన్నా మీరు బాగా పాదయాత్ర చేసి అలసిపోయినట్టున్నారు.. కాస్త రెస్టు తీసుకోండి’ అంటూ.. అందుకే మీరు ఏదేదో మాట్లాడుతున్నారన్నట్టుగా దెప్పిపొడిచారు. ఇలా కేటీఆర్ చాలా సుదీర్ఘంగా హేళనలతో కూడిన ప్రసంగం కొనసాగించారు గానీ.. అందులో అసలు విషయం మాత్రం లేదు.

అయితే.. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన 15, 20 లక్షల వంతున నిధులను ప్రభుత్వం విడుదల చేసిందా? లేదా? అనే అసలు ప్రశ్నకు జవాబు ఇవ్వనే లేదు. అసలు సమస్యను పక్కదారి పట్టించడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇంతటి చాతుర్యం కేసీఆర్ తర్వాత కేటీఆర్ లోనే కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.