కలహాలతో తగలెట్టడమే చంద్రబాబు తాజా స్కెచ్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా పదినెలల దూరంలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయుడు తన దూకుడును టాప్ గేర్ లోకి తీసుకువెళ్లిపోతున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే.. ప్రజలు ప్రశాంతంగా ఆలోచించుకునే వాతావరణం ఉంటే.. ఫలితం ఎలా…

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా పదినెలల దూరంలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయుడు తన దూకుడును టాప్ గేర్ లోకి తీసుకువెళ్లిపోతున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే.. ప్రజలు ప్రశాంతంగా ఆలోచించుకునే వాతావరణం ఉంటే.. ఫలితం ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఒక క్లారిటీ ఉంది. 

ముసలివాణ్నయిపోయాను.. చివరి చాన్స్ ఇవ్వండి.. ఇంకొక్కసారి ముఖ్యమంత్రి అవుతాను.. అని దేబిరించడం ద్వారా ప్రజల్లో సానుభూతిని సంపాదించి ఎన్నికల్లో నెగ్గాలని అనుకుంటున్న తన కలలు.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వల్ల నెరవేరవనే స్పష్టత ఆయనకు ఉంది. అందుకే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేయాలని అనుకుంటున్నారు. తాను ఎక్కడ అడుగుపెడితే అక్కడ కలహాలను రెచ్చగొట్టడానికి ఆయన తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అశాంతిలోకి నెట్టి.. ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి.. ఆ భయం పునాదుల మీద తను గెలవాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఆయన సాగిస్తున్న యాత్రలే ఇందుకు నిదర్శనాలు. శుక్రవారం నాడు పుంగనూరులో ఎంతటి దుర్మార్గానికి తెగబడ్డారో ప్రజలందరూ గమనించారు. పుంగనూరులో ఏకంగా పోలీసుల మీదనే తెలుగుదేశం గూండాలు దాడికి దిగడం, పోలీసుల తలలు పగలగొట్టడం, పోలీసు వాహనాలను తగులబెట్టడం అనేది.. గత అయిదారేళ్లలో రాష్ట్రంలో జరిగిన అది పెద్ద ఘోరంగా పేర్కొనవచ్చు. 

పుంగనూరు దగ్గరినుంచి ఏ సభలోనైనా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలను గమనిస్తే.. అచ్చంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఆయన జనాలను తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయి పెద్దస్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఇవాళ ఆయన శ్రీకాళహస్తిలో అడుగుపెడితే.. అక్కడ కూడా ఘర్షణలకు ఉసిగొల్పుతున్నారు.

ఎక్కడ ఏం మాట్లాడినా.. ఆయన ప్రతిమాట కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలోనే సాగుతుండడాన్ని గమనించాలి. శ్రీకాళహస్తిలో మాట్లాడుతూ.. ‘‘వైకాపా నేతలు కర్ర తెస్తే తామూ కర్రతెస్తామని, వాళ్లు ఒక దెబ్బ కొడితే తాము రెండు దెబ్బలు కొడతామని..’’ చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ఘర్షణలు లేని ప్రశాంతమైన ఊర్లలో కూడా చిచ్చు పెట్టగల స్థాయిలో చంద్రబాబు మాటలు ఉంటున్నాయి.

చంద్రబాబు బుద్ధిని ముందే గమనించినట్టుగా.. పుంగనూరు అల్లర్ల నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపురెడ్డి మధుసూదన రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే  అనిపిస్తున్నాయి. ‘‘చంద్రబాబునాయుడును ముందు అరెస్టు చేసి జైల్లో పెట్టాలని.. ఆయన బయట ఉంటే.. మరిన్ని అల్లర్లు జరగడానికి కారణం అవుతారని, విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నారని.. చంద్రబాబునాయుడును మించిన రౌడీ, గూండా మరొకరు కనిపించడం లేదని’’ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆ మాటలు నిజమే అనిపించేలా.. ప్రతిచోటా రెచ్చగొట్టే మాటలతోనే చంద్రబాబు ఊరేగుతుండడం విశేషం.