భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. ఓ అద్భుతమైన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవడానికి ‘మందు పంచను.. పైసలు ఇవ్వను’ అని ఆయన పేర్కొన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయనని కూడా అన్నారు.
ఏ నాయకుడిని అడిగినా ఇలాగే చెప్తారు కదా.. నేను డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటా.. లిక్కర్ తాగించి ఓట్లు వేయించుకుంటా- అని ఎవరూ చెప్పరు కదా అని ఎవరైనా వాదించవచ్చు. కేటీఆర్ మాటలను కొట్టి పారేయవచ్చు. కానీ ఈ మాటలు చెప్పింది ఏ రాజకీయ సభలోనో కాదు. పసిపిల్లల పాఠశాలలను ప్రారంభించడానికి తన సొంతనియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మాటలు, నమ్మదగిన రీతిగానే చెప్పారు.
ఆ మాటకొస్తే.. కేటీఆర్ స్థాయికి వెళ్లిన తర్వాత.. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ, వాస్తవంలో అంతకంటె పెద్ద స్థాయిలోనే అధికారాలను చెలాయిస్తూ తన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగానూ అభివృద్ధి చేసిన ఒక నాయకుడు.. మరోసారి గెలవడానికి ప్రధానంగా డబ్బు, సారా మీద ఆధారపడాల్సి ఉండకపోవచ్చు. సిరిసిల్లలో డబ్బు పంచే అవసరం లేకుండానే కేటీఆర్ గెలుపు సాధ్యం కావొచ్చు. ఆ ధీమాతోనే ఆయన ఆ మాట చెప్పి ఉండొచ్చు. ఆయన మాట నిలబెట్టుకుంటారనుకుంటే, ఇంత మంచి ఆదర్శమైన నిర్ణయం తీసుకున్నందుకు కేటీఆర్ ను అభినందించాలి.
కానీ, కాస్త లోతుగా వెళ్లి ఆలోచించాలి. ‘ఓట్ల కోసం తాను డబ్బు పంచను, లిక్కరు తాగించను’ అని చెప్పినంత మాత్రాన కేటీఆర్ గొప్ప నాయకుడు ఎలా అవుతారు? కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రమే అవుతారు! గొప్ప వాడంటే.. తాను చెప్పే విలువలను, ఆదర్శాలను తాను ఆచరించి.. అంతటితో సరిపెట్టుకోమంటే కుదరదు. తాను చెప్పే విలువలను తన జట్టులోని వారందరితో కూడా ఆచరింపజేసినప్పుడే అతడు నాయకుడు అనిపించుకుంటాడు. ఈ సిద్ధాంతాన్ని భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అర్థం చేసుకోవాలి.
డబ్బు పంచకుండా, లిక్కర్ తాగించకుండా ప్రజల ప్రేమను పొందడం, ఓట్లు కొల్లగొట్టడం అనేది.. తమ పార్టీ సిద్ధాంతంగా ఆయన చెప్పగలగాలి. తమ పార్టీ వారెవ్వరూ ఆ పని చేయకుండా చూడగలిగితే.. మహానాయకుడు అని మనం కీర్తించవచ్చు. అలాంటి ప్రమాణం ఆయన చేయగలరా? అనేది ప్రశ్న.
ఇవాళ రాజకీయాలు మొత్తం డబ్బు మయం అయిపోయి.. ఒక్కో ఓటు రెండువేలు, మూడు వేలు వంతున ధర పలుకుతున్న రోజుల్లో డబ్బు ఇవ్వకుండా పార్టీ మొత్తాన్ని ఎన్నికల సమరంలోకి ఆదర్శాలతో దించుతామని అనేట్లయితే.. వారికి తాము పదేళ్లు సాగించిన పరిపాలన మీద అపారమైన నమ్మకం ఉండాలి. అంత నమ్మకం కేటీఆర్ అండ్ కో కు ఉందా? ఉన్నట్లయితే.. తన గురించి ఆదర్శాలు చెప్పడం కాదు.. ఆ ఆదర్శాలను తన పార్టీ మొత్తానికి ఒక నిబంధనగా కేటీఆర్ వర్తింపజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.