మరో వీకెండ్ వస్తోంది. కానీ ఆదిపురుష్ సినిమాకు ఎలాంటి ఢోకా లేదు. ఈ వీకెండ్ అటుఇటుగా 10 సినిమాలు రాబోతున్నాయి. కానీ ఆదిపురుష్ కు పోటీనిచ్చే స్థాయిలో ఒక్క సినిమా కూడా రావడం లేదు. కాబట్టి, ప్రభాస్ సినిమాకు మరో వీకెండ్ కలిసొస్తున్నట్టే లెక్క. అయితే ఇప్పటికే నెగెటివ్ టాక్ తో ఇబ్బందిపడుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో కోలుకుంటుందనేది పెద్ద ప్రశ్న.
ఈ వీకెండ్ రాబోతున్న సినిమాల్లో కాస్త ఎట్రాక్ట్ చేస్తున్నవి మనుచరిత్ర, 1920 మూవీస్ మాత్రమే. శివ కందుకూరి హీరోగా నటించిన మనుచరిత్ర సినిమా ట్రయిలర్ ఆకట్టుకుంది. ఇక అవికా గౌర్ నటించిన 1920 అనే సినిమా పూర్తిగా హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు మరో 6-7 సినిమాలు వస్తున్నప్పటికీ, వాటిపై పెద్దగా బజ్ లేదు.
అలా అని మనుచరిత్ర, 1920 సినిమాలు కూడా ఆదిపురుష్ కు పోటీ లేదు. సో.. ప్రభాస్ సినిమాకు మరో వీకెండ్ కలిసొస్తుంది.
అయితే ఈ సినిమాకు ఇప్పటికే వసూళ్లు తగ్గిపోయాయి. సోమ, మంగళవారాలు చాలా తక్కువగా వసూళ్లు వచ్చాయి. సాధారణ రోజుల్లో ఈ తగ్గుదల సహజమే అయినప్పటికీ, నెగెటివ్ టాక్ బాగా ఇబ్బంది పెడుతోంది.
అయితే ఈ వారాంతానికి సినిమాలో మార్పుచేర్పులు పూర్తవుతాయి. వివాదాస్పదమైన హనుమంతుడి డైలాగ్ ను మారుస్తున్నారు. కాబట్టి.. శని, ఆదివారాల్లో ఈ సినిమా పుంజుకుంటుందని భావిస్తోంది యూనిట్.