ఎల్లో మీడియా ట్రాప్‌లో కేటీఆర్‌!

తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా తెలివైన నాయ‌కుడు. ఇందులో రెండో మాట‌కు చోటు లేదు. అలాంటి తెలివైన నాయ‌కుడు ఎల్లో మీడియా ట్రాప్‌లో ప‌డ్డార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ ఓట్లను పొందేందుకు సీఎం కేసీఆర్‌,…

తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా తెలివైన నాయ‌కుడు. ఇందులో రెండో మాట‌కు చోటు లేదు. అలాంటి తెలివైన నాయ‌కుడు ఎల్లో మీడియా ట్రాప్‌లో ప‌డ్డార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ ఓట్లను పొందేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు నాట‌కాలాడుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే టీడీపీ శ్రేణుల మెచ్చుకోలు కోసం మాట్లాడుతున్న మాట‌లు, ఆ పార్టీ వ్య‌తిరేక ఓట్ల‌ను పోగొట్టుకునే ప్ర‌మాదం పొంచి వుంద‌ని గ్ర‌హించ‌డం లేదు.

బీఆర్ఎస్ కీల‌క మంత్రుల‌తో ఎల్లో మీడియా ఇంట‌ర్వ్యూలు కాంగ్రెస్‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ఉన్నాయి. ఆర్కే నిర్వ‌హించిన బిగ్ డిబేట్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఓటుకు నోటు కేసును రీఓపెన్ చేయాల‌ని, అలాగే రామోజీరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి అడిగితే, సీఎం కేసీఆర్ మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించార‌ని కేటీఆర్ సుద్ధులు చెప్పారు. త‌ద్వారా క‌మ్మ సామాజిక వ‌ర్గం, అలాగే టీడీపీ అనుకూల ఓట్లు కొల్ల‌గొట్టే వ్యూహం క‌నిపించింది.

ఇదే సంద‌ర్భంలో టీడీపీని వ్య‌తిరేకించే వారి ఓట్లు పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌నే స్పృహ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావు త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా టీడీపీ అనుకూల ఓట్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌కు ప‌డ‌వు. వాళ్లంతా కాంగ్రెస్‌కు వేయాల‌ని డిసైడ్ అయ్యారు. అలాంట‌ప్పుడు టీడీపీ ఓట్ల కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ సానుకూల ఓట్ల‌ను పోగొట్టుకోవ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

కేసీఆర్‌, కేటీఆర్, హ‌రీష్‌రావు ప‌దేప‌దే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అనుకూల ఓట‌ర్లు బీఆర్ఎస్‌కు ఓట్లు వేసేందుకు త‌ట‌ప‌టాయిస్తున్న ప‌రిస్థితి. పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టు వైసీపీ వ్య‌తిరేకించే చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై కేటీఆర్ సానుకూల కామెంట్స్‌తో వారిలో వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఒక‌వైపు టీడీపీ అనుకూల ఓట్లు ద‌క్కించుకోలేక‌, మ‌రోవైపు వైసీపీ అనుకూల ఓట్ల‌ను పోగొట్టుకోవ‌డం త‌ప్ప బీఆర్ఎస్ సాధిస్తున్న‌దేంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.