తెలంగాణలో కేసినో కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ రాజకీయ నేతల్లో గుబులు రేపుతోంది. అసలే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో టీఆర్ఎస్‌కు రాజకీయంగా తీవ్ర వైరం నడుస్తోంది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ విచారణలంటే వణికిపోయే పరిస్థితి. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ ఏముందనే సామెత చందాన తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు తయారయ్యాయి.
ఈ నేపథ్యంలో కేసినో కేసుకు సంబంధించి ఈడీ విచారణను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయన సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వైపు ఆయన వెళ్లారు. అనుకోని రీతిలో ఈడీ అధికారుల నుంచి ఆయన నోటీస్ అందుకున్నారు.
చికోటి ప్రవీణ్ కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణ కూడా ఇరుక్కున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ ఈడీ విచారణ నిమిత్తం వెళ్లారు. లిప్ట్‌లో కాకుండా పై అంతస్తులో వున్న ఈడీ ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళ్లారు. బీపీ డౌన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈడీ అధికారులను అడిగి నీళ్లు తెప్పించుకుని తాగారు. కాసేపు సేద తీరినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు.
తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఈడీ అధికారుల దృష్టికి ఎల్.రమణ తీసుకెళ్లారు. దీంతో ఆయన్ను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈడీ అధికారులు తరలించారు. రమణను విచారించడానికి వీలే కానట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఎల్.రమణ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. తమ నాయకుడిని ఈడీ ఇరికిస్తుందనే ఆందోళనలో అనుచరులు ఉండడం గమనార్హం.