కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశ మైంది. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తాననడంతో పాటు బిడ్డా…చంపుతం అని హెచ్చరించారు. అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. జాగ్రత్తగా వుండాలని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు ఆమె హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అలాగే ట్విటర్ వేదికగా అర్వింద్ ఇంటిపై దాడిని, కవిత తిట్ల పురాణాన్ని తప్పు పట్టారు.
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, కేవలం అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్నో అరాచకాలు చేస్తూ నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో చొరబడి దాడులు చేసే పరిస్థితి తెలంగాణలో రావడం అత్యంత శోచనీయమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భాష సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశారని తప్పు పట్టారు. ఇండ్లలోకి వెళ్లి దాడి చేసి, దాడి చేస్తామని కవిత దుర్భాషలు ఆడుతున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? అని ఆమె నిలదీశారు. ప్రధానిపై మీ వ్యాఖ్యలు మర్చిపోయారా కెసిఆర్, వాక్ స్వాతంత్ర్యం కేవలం మీ కుటుంబానికేనా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ వ్యవహార శైలే ఎవరైనా ఏదైనా మాట్లాడ్డానికి కారణమైందన్నారు. మీరు మాత్రం ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదా? ఎక్కడికి పోతున్నారు? తెలంగాణ వచ్చింది ఇందుకోసమేనా? గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఏం చేశారని అరుణ నిలదీశారు. పశ్చిమబెంగాల్ మాదిరిగా మార్చాలని అనుకుం టున్నారా? అని టీఆర్ఎస్ నేతల్ని ఆమె ప్రశ్నించారు.
దేశ ప్రధాని మోదీని పట్టుకుని కేసీఆర్ వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు సిగ్గు అనిపించడం లేదా? అని నిలదీశారు. తెలంగాణ ఆకాంక్షలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఏం చేసినా బీజేపీ చేతులు కట్టుకుని వుంటుందని అనుకుంటే …జాగ్రత్త అని ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ ఘటనకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.