రాయలసీమ పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో చంద్రబాబుకు తెలిసొచ్చింది. వేలాదిగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కోసం తరలి వచ్చారని తెలిసినా, వారిని ఏ మాత్రం లెక్క చేయకుండా…సీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినదించడం విశేషం. గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో తన సభకు జనం రాలేదని, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఇదే సందర్భంలో బాబుకు ఎదురెళ్లి, రాయలసీమకు రాజధానిపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేయడం చిన్న విషయం కాదు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కర్నూలు జిల్లాకు వచ్చారు. కర్నూలులో పర్యటిస్తున్న చంద్రబాబుకు భారీ నిరసన సెగ తగిలింది. చంద్రబాబు కాన్వాయ్‌ని విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ విద్యార్థులు, న్యాయవాదులు నినదించారు. బాబు కాన్వాయ్ ముందు వారు బైఠాయించడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలు, బ్లాక్ బెలూన్లతో తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తానని జగన్ ప్రభుత్వం చెబుతుంటే, వద్దే వద్దని చంద్రబాబు పాదయాత్రలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. సీమకు న్యాయరాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని వద్దని …అమరావతి రైతుల పేరుతో కొంత మంది రియల్టర్లు పాదయాత్ర చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న సంగతి తెలిసిందే.
తమ ప్రాంత ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ, అభివృద్ధికి అడ్డు పడుతున్నారనే ఆగ్రహం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుంది. చంద్రబాబు పర్యటనలో ఆ ఆగ్రహం, ఆక్రోశం బయటపడింది. బాబుకు అండగా వేలాదిగా ఉన్న తెలుగు తమ్ముళ్లు, పోలీసులను సైతం లెక్క చేయకుండా న్యాయ రాజధానిపై వైఖరి ఏంటో చెప్పాలని నిలదీయడం అద్వితీయం.
ఇదే ఆ ప్రాంత ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెబుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను నిలదీసిన విద్యార్థులు, న్యాయవాదులకు సమాధానం చెప్పకపోవడంతో పాటు తోలు తీస్తా, తాట తీస్తా అని చంద్రబాబు హెచ్చరించడం ఆయన అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. చంద్రబాబు ఏమైనా చర్మాల వ్యాపారం చేస్తున్నారా? అని నెటిజన్లు సెటైర్స్ వేస్తు న్నారు. రాయలసీమలో పుట్టి పెరిగి, రాజకీయంగా ఎదిగి, తిరిగి ఆ ప్రాంతానికి వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లిందన్న విమర్శ వెల్లువెత్తుతోంది.
‘నేను రౌడీలకు రౌడీని… గూండాలకు గూండాను.. ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడను. ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడానికి ఎంతకైనా తెగిస్తా.. నన్ను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయం’ అని చంద్రబాబు హెచ్చరించడం గమనార్హం. రాయలసీమకు వచ్చి రౌడీయిజం గురించి చంద్రబాబు సుద్ధులు చెప్పడం విచిత్రంగా వుంది. బాబు రౌడీయిజం, గూండాయిజం గురించి కోస్తాలో చెబితే చెల్లుబాటు అవుతుందేమో. ఎందుకంటే చంద్రబాబు కూడా రాయలసీమ వాసే.
ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి సీమ జనానికి బాగా తెలుసు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడంటే మూడే చోట్ల గెలిపించారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరింత నష్టపోకుండా చూసుకుంటే చంద్రబాబుకే మంచిది. సొంత వాళ్లే… ద్రోహి గో బ్యాక్ అని నినదిస్తున్నారంటే, చంద్రబాబుకు ఇంతకంటే అవమానం ఏం కావాలి?