పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందనే సెంటిమెంట్ రాజకీయపార్టీల్లో బలంగా నాటుకుపోయింది. ఈ సెంటిమెంట్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూ పాకింది. దీంతో రాహుల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి 2004 లో అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఏపీలోనే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు అన్న పార్టీ ఉనికిని కాపాడటానికి చెల్లెలు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసింది. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పాదయాత్ర చేసి విభజిత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత జగన్ పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో సీఎం అయ్యారు.
2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడంకోసం చంద్రబాబు తనయుడు లోకేష్ ఏడాదిపాటు సైకిల్ యాత్ర చేయబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నాడట. ఇక తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటివరకు విడతలవారీగా పాదయాత్ర చేశారు. మళ్ళీ త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నాడట.
వైఎస్ షర్మిల ఈ మధ్యనే మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఇలా అధికారాన్ని ఆశించే నాయకులందరూ పాదయాత్రల దారి పట్టారు. తెలంగాణలో మరో నాయకుడు తొందరలోనే యాత్ర చేయబోతున్నాడు. ఆయనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ మారుతున్న సమయంలో.. పార్టీ కేడర్ లో జోష్ నింపేలా కార్యచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం.
ఎన్నికలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉండటంతో, అటు కేడర్ లో జోష్ పెంచటం తో పాటుగా.. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, బస్సు యాత్రకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, పాదయాత్ర చేయటం ద్వారానే… నేరుగా ప్రజలు – పార్టీ కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు వెసులుబాటు కలుగుతుందనేది మరో వాదన.
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ఆదరణ ఉందని, దానిని ఓట్లుగా మలచుకోవాలంటే పార్టీ కార్యకర్తల్లో..సానుభూతి పరుల్లో నాయకత్వం పైన నమ్మకం కలిగించాలని పార్టీ అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో, జవనరి లో తెలంగాణ వ్యాప్తంగా పర్యటన ఉండేలా రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ ప్రణాళిక ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. రాహుల్ జోడో యాత్ర వరకు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ చేయగలిగారు. కానీ, అదే సమయంలో జరిగిన మనుగోడు ఫలితం పైన సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మరో 10 నెలల్లో మూడో సారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో, ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రేవంత్ కలిసిన సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన క్లియర్ గా రూట్ మ్యాప్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. గ్రూపులు – వ్యక్తులు – వివాదాలు పక్కన పెట్టి.. టీపీసీసీ చీఫ్ గా పార్టీలో జోష్ పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ తేల్చి చెప్పింది. అందులో భాగంగా..తెలంగాణలో షర్మిల.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రల విషయం పైన చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కానుగోలు ఇప్పటికే రేవంత్ ప్రజల్లోకి వెళ్లే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి సహకరించనంత కాలం ఎన్ని పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు.