మునుగోడులో గుర్తు గోల‌.. ఆర్వో బ‌దిలీ!

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో గుర్తు గోల కొన‌సాగుతూ ఉంది. యుగ‌తుల‌సి అనే రిజిస్ట‌ర్డ్ పార్టీకి రోడ్డురోల‌ర్ గుర్తును కేటాయించ‌డంపై అధికార టీఆర్ఎస్ నిర‌స‌న తెలుపుతోంది. కారును పోలిన రోడ్డు రోల‌ర్ గుర్తు…

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో గుర్తు గోల కొన‌సాగుతూ ఉంది. యుగ‌తుల‌సి అనే రిజిస్ట‌ర్డ్ పార్టీకి రోడ్డురోల‌ర్ గుర్తును కేటాయించ‌డంపై అధికార టీఆర్ఎస్ నిర‌స‌న తెలుపుతోంది. కారును పోలిన రోడ్డు రోల‌ర్ గుర్తు వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ అంటోంది. ప్ర‌తి ఓటూ విలువైన ఈ ఉప ఎన్నిక‌లో రోడ్డు రోలర్ గుర్తు టీఆర్ఎస్ ను హ‌డ‌లెత్తిస్తోంది.

గ‌తంలో కూడా ఈ త‌ర‌హాలో దెబ్బ‌తిన్నాయి వివిధ పార్టీలు. నిర‌క్ష‌రాస్యులు, వృద్ధులు ఇలాంటి సంద‌ర్భాల్లో గంద‌ర‌గోళానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. ఈవీఎంపై ఉండే ప్రింట్ స‌రిగా ఉండ‌దు. ఇలాంటి నేప‌థ్యంలో గుర్తును పోలిన గుర్తులు త‌యార‌వుతూ ఉంటాయి. ఈ విష‌యంలో ముందుగా ఎన్నిక‌ల క‌మిష‌నే జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అయితే మునుగోడు బైపోల్ విష‌యంలో ఒక అనామ‌క పార్టీ రోడ్డు రోల‌ర్ గుర్తును కోర‌గానే కేటాయించారు.

అయితే ఈ విష‌యంపై టీఆర్ఎస్ నిర‌స‌న‌కు దిగింది. ఆ వెంట‌నే రిట‌ర్నింగ్ అధికారి గుర్తును మార్చేశార‌ట‌. స‌ద‌రు పార్టీకి క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా.. రోడ్డు రోల‌ర్ గుర్తుకు బ‌దులుగా బేబీ వాక‌ర్ గుర్తును ఇచ్చార‌ట‌. అయితే ఈ విష‌యంపై సీఈసీకి ఫిర్యాదు చేశారు స‌ద‌రు పార్టీ అభ్య‌ర్థి. త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా రోడ్డు రోల‌ర్ గుర్తును ర‌ద్దు చేసి బేబీ వాక‌ర్ గుర్తును ఇచ్చార‌ని, ఈ విష‌యంలో త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఫిర్యాదు సీఈసీకి చేరింద‌ట యుగ‌తుల‌సి పార్టీ.

ఈ నేప‌థ్యంలో రిట‌ర్నింగ్ అధికారిని ఎన్నిక‌ల క‌మిష‌న్ బ‌దిలీ చేసింది. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రికి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. అంతేగాక‌.. రోడ్డు రోల‌ర్ గుర్తునే ఖ‌రారు చేసింద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి మునుగోడు పోరులో రోడ్డు రోల‌ర్ ఎన్ని ఓట్ల‌ను పొందుతుందో!