తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కేంద్రంగా జరగనున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును ఈడీ ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ, ఈడీ కేవలం విచారణ వరకే పరిమితం చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి సంబంధాలు ఉన్నాయన్న విమర్శకు బలం కలిగిస్తోంది. అయితే బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని ప్రధాని మోదీ మొదలు, అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతలంతా ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బిడ్డ కవితపై నేరుగా విమర్శలు గుప్పించారు. అది కూడా తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని రాష్ట్రంలో కేసీఆర్, కవితలపై ఘాటు విమర్శలు చేయడం ఆసక్తికర పరిణామం. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ భోపాల్‌లో నిర్వహించిన పలు ఈవెంట్స్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
ప్రధాని ప్రసంగిస్తూ కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్కు .. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసమైతే బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందని ఆయన అన్నారు. సీబీఐ, ఈడీలు ఆమెను విచారించాయన్నారు. అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు. బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ చెప్పారు. ఇటీవల బీహార్ సీఎం నితీష్ నేతృత్వంలో ప్రతిపక్షాలు భేటీ కావడాన్ని ఆయన ప్రస్తావించారు.
తనకు వ్యతిరేకంగా సమావేశమైన ప్రతిపక్షాల నేతలంతా 20 లక్షల కోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్, కవితపై ప్రధాని విమర్శలు గుప్పించినట్టు అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా కవిత కేంద్రంగా బీఆర్ఎస్ను బీజేపీ టార్గెట్ చేసేందుకు వ్యూహం రచించినట్టు ప్రధాని విమర్శలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇదే సందర్భంలో కవితను అరెస్ట్ చేయకపోవడాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఎన్నికల సమయంలో ఉత్తుత్తిగా కొట్టుకుంటున్నట్టు నటిస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేయకపోవడాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌కు ఒక అవకాశం దక్కింది.
ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కవిత కేంద్రంగా రాజకీయ దుమారం చెలరేగే అవకాశం ఉంది.