జాతీయ పార్టీ పెట్టాలని ఉవ్వాళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్లోనే రాంగ్ స్టెప్ వేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. జాతీయ పార్టీ పెట్టాలనుకుంటే సరిపోదని, జాతీయ దృక్పథం వుండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ లక్షణాలు కేసీఆర్‌లో మచ్చుకైనా లేవని ….మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదనే నిర్ణయంతో వెల్లడైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆమె ఆహ్వానించారు. కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టారు. సమావేశానికి వెళ్లకూడదనే కీలక నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను ఆహ్వానించకూడదనే తన అభిప్రాయానికి విరుద్ధంగా మమత వ్యవహరించారనేది కేసీఆర్ ఆరోపణ.
అంతేకాదు, గత 8 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్ఎస్ సమదూరం పాటిస్తోందని, ఇప్పుడు మమత ఏర్పాటు చేసిన సమావేశానికి వెళితే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావన. ఎందుకంటే ఆ సమావేశానికి కాంగ్రెస్ హాజరుకానుండడమే. బీజేపీకి వ్యతిరేకంగా మొదటి కాంగ్రెస్ పని చేస్తోంది. ఇదే కేసీఆర్ విషయానికి వస్తే తనకు అవసరమైనప్పుడు మోదీ సర్కార్‌కు మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోందని గ్రహించి, మోదీకి వ్యతిరేక నినాదం ఎత్తుకున్నారు. ఇది అసలు వాస్తవం.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటు సాధ్యం కాదని పలువురు అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. మోదీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండకూడదనే కేసీఆర్ డిమాండ్ చూస్తే, ఈయన బీజేపీకి అనుకూలమా? వ్యతిరేకమా? అనేది అర్థం కావడం లేదని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తెచ్చే క్రమంలో కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని అభివర్ణించేవాళ్లు లేకపోలేదు.