అసలు భారత రాష్ట్ర సమితి మీద బిజెపి ఎంత మాత్రం చిత్తశుద్ధితో పోరాడుతోంది? కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి.. కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బిజెపి ఎంత మేరకు కృతనిశ్చయంతో ఉంది? వారు పైకి చెబుతున్న మాటలన్నీ, పోరాటంలో ప్రదర్శిస్తున్న ఆవేశమంతా.. నిజమేనా? అనే అనుమానాలు తొలుత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, జూపల్లి కృష్ణారావుకు కలిగాయి. అందుకే.. ఈటల వెళ్లి వారిని బిజెపిలోకి ఆహ్వానించినప్పుడు, కేసీఆర్ ను ఇంటికిపంపే సత్తా, శ్రద్ధ మీకున్నాయా? అని అడిగి వెనక్కు పంపించారు.
బిజెపి ఒకవైపు యుద్ధంలో కొదమసింహంలాగా కేసీఆర్ సర్కారు మీద విరుచుకుపడుతూ ముందుకు సాగుతోంటే.. పొంగులేటి అండ్ కో ఇంత బేసిక్ డౌట్స్ అడుగుతున్నారేమిటా? అని అందరూ వారినే అనుమానించారప్పుడు. ఇప్పుడు రాజకీయాలను గమనిస్తోంటే ప్రజలందరికీ అవే సందేహాలు కలుగుతున్నాయి. బిజెపి, కేసీఆర్ సర్కారు మీద పోరాటం సాగించడంలో పైపై పటాటోపం మాత్రమేనా అనిపిస్తోంది.
నాగర్ కర్నూలులో బిజెపి జాతీయ సారధి జెపి నడ్డా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తీరుచూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నడ్డా తన ప్రసంగంలో దేశంలో ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాం అని ప్రకటించారు. అందులో తెలంగాణకు రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశాం అన్నారు. అంటే దేశంలో తెలంగాణకు బిజెపి ఇచ్చిన వాటా కేవలం ఒక్క శాతం మాత్రమేనా అనే ఆవేదన ఇక్కడి ప్రజలకు కలుగుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే, తెలంగాణకు మంజూరైన రెండున్నర లక్షల ఇళ్లలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని నడ్డా ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినందుకు సీఎం కేసీఆర్ ను జైలుకు పంపించాలని నడ్డా పిలుపు ఇస్తున్నారు!కేసీఆర్ ను జైలుకు పంపించాలని నడ్డా ఎవరికి చెబుతున్నారు? ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండగా.. తెలంగాణలోని కేసీఆర్ అవినీతి పట్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి నేతలే మండిపడుతున్నారు.
కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఊరుకోం అని.. బిజెపి సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. చివరికి నాగర్ కర్నూల్ నడ్డా సభకు కూడా హాజరు కాలేదు. అంతగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న కేంద్రం తరఫున నడ్డా అలాంటి పనిచేయకపోగా.. కేసీఆర్ ను జైలుకు పంపాలి.. అని నాగర్ కర్నూలు రోడ్లమీద నినదిస్తే అది కామెడీ కాక మరేమిటి. ఇలాంటి మాటలను తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అందుకే.. నడ్డాజీ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తెలంగాణ ఓట్లు రాలవు అని విశ్లేషకులు భావిస్తున్నారు.