ఈ తిక్కేంటో.. దాని లెక్కేంటో!

తెలంగాణ‌లో బీజేపీ, జ‌న‌సేన పొత్తులో ఉన్నాయి. జ‌న‌సేన‌కు 8 సీట్ల‌ను కూడా బీజేపీ కేటాయించింది. అంతేకాదు, వీటిలో రెండు మూడు చోట్ల త‌న అభ్య‌ర్థుల‌నే బీజేపీ నిలిపి, ప‌వ‌న్ ప‌రువు నిలిపింది. జ‌న‌సేన గ్లాస్…

తెలంగాణ‌లో బీజేపీ, జ‌న‌సేన పొత్తులో ఉన్నాయి. జ‌న‌సేన‌కు 8 సీట్ల‌ను కూడా బీజేపీ కేటాయించింది. అంతేకాదు, వీటిలో రెండు మూడు చోట్ల త‌న అభ్య‌ర్థుల‌నే బీజేపీ నిలిపి, ప‌వ‌న్ ప‌రువు నిలిపింది. జ‌న‌సేన గ్లాస్ గుర్తు కూడా లేద‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే ఏవో తంటాలు ప‌డి తెలంగాణ‌లో కూడా గాజు గ్లాస్ గుర్తును జ‌న‌సేన సాధించుకోగ‌లిగింది. ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఇటీవ‌ల తెలంగాణలో ఒక బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొన్నారు.

ఆకాశ‌మే హ‌ద్దుగా మోదీని ప‌వ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మ‌రోసారి మోదీనే ప్ర‌ధాని కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. కానీ బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ప‌వ‌న్ భ‌య‌ప‌డ్డారు. ఇదే ఏపీలో మాత్రం వైసీపీపై ప‌వ‌న్ ఊగిపోవ‌డాన్ని చూశాం. అదేంటో గానీ, తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి కూడా ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు తెర‌వ‌డానికి ప‌వ‌న్ వెనుకంజ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలంగాణ‌లో త‌మ త‌ర‌పున ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేస్తార‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు వారాల గ‌డువు మాత్ర‌మే వుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ప్ర‌చారానికి సంబంధించి ఇటు బీజేపీ, అటు జ‌న‌సేన నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ మాత్రం సంబ‌రానికి తెలంగాణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎందుకు పోటీ చేయాల‌నే ప్ర‌శ్న ఉత్పన్న‌మైంది. అస‌లు ఆయ‌న ఎందుకు పోటీ చేస్తున్నారు?

క‌నీసం త‌న అభ్య‌ర్థుల కోస‌మైనా ప్ర‌చారం చేయ‌రా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌కు ఒక ల‌క్ష్యం లేద‌నేందుకు తెలంగాణ‌లో పోటీ చేయ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయం లేక‌పోలేదు. బ‌లం లేని చోట పోటీ చేయ‌డం, ప్ర‌చారానికి దూరంగా వుండ‌డం…హేమిటో ఈ తిక్క‌, దీని లెక్క ఏంటో అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.