తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి ఆయన వెళ్లారు. కానీ ఆయనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ వెళ్లలేదు. బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న విచారణను ఆయన ఎదుర్కోవాల్సి వుంది.
అయితే డ్రగ్స్ వ్యవహారంతో రోహిత్‌రెడ్డికి సంబంధాలున్నాయని ఈడీ నోటీసులు ఇవ్వడానికి ముందే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇదే టీఆర్ఎస్ నేతలకు ఆయుధం ఇచ్చినట్టైంది. ఈడీ నోటీసులు ఇచ్చే సంగతి బండి సంజయ్‌కి ముందే ఎలా తెలుసని ప్రశ్నలతో నిలదీస్తోంది. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చినట్టు గానీ, ఎఫ్ఐఆర్లో తన పేరున్నట్టు గానీ నిరూపించాలని రోహిత్‌రెడ్డి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
మీరు డ్రగ్స్ ఎన్నడూ ముట్టలేదని ప్రమాణం చేయగలరా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని, దమ్ముంటే బండి సంజయ్, రఘునందన్‌రావు రావాలని రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆధారాలుంటే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ ప్రకటించినట్టుగా ఉదయం 10 గంటలకు ఆలయం వద్దకెళ్లారు.
ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సవాల్‌ను స్వీకరించి ప్రమాణానికి వచ్చే దమ్ము లేదా అని నిలదీశారు. తనపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా లేనివారిని బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న రఘునందన్ రావు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పరిశ్రమల యజమానులను బెదిరించలేదా అని నిలదీశారు.