జ‌న‌సేన‌లో వైసీపీ నేత చేరిక‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మక్షంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వ‌ర‌రావు ఆ పార్టీలో చేరారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజోలు నుంచి వైసీపీ త‌ర‌పున బొంతు రాజేశ్వ‌రరావు పోటీ చేసి ఓడిపోయారు. జ‌న‌సేన త‌ర‌పున రాజోలు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మక్షంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వ‌ర‌రావు ఆ పార్టీలో చేరారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజోలు నుంచి వైసీపీ త‌ర‌పున బొంతు రాజేశ్వ‌రరావు పోటీ చేసి ఓడిపోయారు. జ‌న‌సేన త‌ర‌పున రాజోలు నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌రావు పేరొందారు. రాపాక జ‌న‌సేన ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారుడిగా కొన‌సాగుతున్నారు.

రాపాక వార‌సులు వైసీపీలో అధికారికంగా చేరారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వ‌ర‌రావుకు సీఎం జ‌గ‌న్ పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ స‌ల‌హాదారుడిగా నియ‌మించింది. అయితే రానున్న ఎన్నిక‌ల్లో వ‌ర‌ప్ర‌సాద్‌కే వైసీపీ టికెట్ ఇస్తుంద‌నే ఉద్దేశంతో బొంతు పార్టీ మార‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్ చేతుల మీదుగా ఆ పార్టీ కండువాను రాజేశ్వ‌ర‌రావు క‌ప్పుకున్నారు.

బొంతు రాజేశ్వ‌ర‌రావుతో పాటు రాజోలు, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు జ‌న‌సేన‌లో చేర‌డం గ‌మ‌నార్హం. రాజోలు ఇన్‌చార్జ్‌గా బొంతు రాజేశ్వ‌ర‌రావును నియ‌మిస్తున్న‌ట్టు తెలిసింది. ఇదిలా వుండ‌గా అక్క‌డ టీడీపీ కూడా బ‌లంగా వుంది. మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి సూర్యారావు బ‌రిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో రాజోలులో జ‌న‌సేన‌కు 33.46%, వైసీపీకి 32.92%, టీడీపీకి 30.47% ఓట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదిరినా, సిట్టింగ్ స్థానం కావ‌డంతో జ‌న‌సేన‌కే టికెట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో బొంతు ఆ పార్టీలో చేరిన‌ట్టు స‌మాచారం.