నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్”. ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో పేరున్న ఈ దర్శకుడు గతంలో నయనతార నాయికగా “మయూరి”, తాప్సీ హీరోయిన్ గా “గేమ్ ఓవర్” చిత్రాన్ని తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. “కనెక్ట్” రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా దర్శకుడు మీడియాతో మాట్లాడారు.
లాక్ డౌన్ లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది..అని దర్శకుడు వివరించారు.
ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు తల్లి ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు అంటూ మొత్తం చెప్పేసారు.
హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు.
ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది, వాటికి ఇంటర్వెల్ గంటన్నరు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది అన్నారు దర్శకుడు అశ్విన్.