బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలంటూ ఈడీ నుంచి కవితకు నోటీసులు రావడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కవితను అరెస్ట్ చేయడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలు పకడ్బందీ వ్యూహం రచించినట్టు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
కవితను అరెస్ట్ చేస్తారనే సమాచారం బీఆర్ఎస్ నేతలకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ శ్రేణులు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీకి కవిత తాజా లేఖ చర్చకు తెరలేచింది. జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 10న ధర్నా, అనంతరం ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలున్నాయని, 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానని ఈడీకి ఆమె లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కవిత లేఖపై ఈడీ అధికారుల స్పందనపై ఉత్కంఠ నెలకుంది. ఆమె విన్నపాన్ని ఈడీ మన్నిస్తుందా? లేక తాము చెప్పిన సమయానికే రావాలని ఆర్డర్ చేస్తుందా? అనేది తెలియాల్సి వుంది. ఈడీ నుంచి నోటీసులు వచ్చిన అనంతరం తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కవిత కేంద్రంగా కేసీఆర్ సర్కార్‌పై ముఖ్యంగా బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా కవితపై విమర్శలు చేస్తున్నాయి.
ఈడీ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించేందుకు తన తండ్రి, సీఎం కేసీఆర్ వద్దకు కవిత వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కవిత ఇంటిలోకి ముఖ్య నాయకులను మినహాయించి, మరెవరినీ అనుమతించలేదు. కవిత ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు కట్టి సెక్యూరిటీని పెంచడం ఆసక్తికరమే. కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోనుందో అనే చర్చకు తెరలేచింది.