అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేనాని పవన్‌కల్యాణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు సంబంధించి పవన్‌కల్యాణ్ ఏం చేసినా ఒక ప్రత్యేకత వుంటుంది. ఎందుకనేది అందరికీ తెలిసిందే.
పవన్‌కల్యాణ్‌కు మహిళలపై ఏ మాత్రం గౌరవం లేదని, అందుకే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేశారని ప్రత్యర్థులు ఘాటు విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహిళల గురించి పవన్ మనసులో ఏముందో ఆయన విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుసుకుందాం.
“మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ. మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా, తోబుట్టువుగా, భార్యగా, బిడ్డగా భిన్న రూపాల్లో మన మధ్య ఉన్న స్త్రీ మూర్తివి సేవలు వెలకట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. మహత్తరమైన వనితాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడాలన్నా, సాధికారతా సాధించాలన్నా చట్టసభల్లో వారి సంఖ్యా బలం పెరగాల్సిన అవసరం వుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది” ఇలా సాగింది ఆయన ప్రకటన.
రానున్న ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా పవన్ తన చిత్తశుద్ధిని చాటుకోవచ్చు. మహిళలపై గౌరవం కేవలం మాటల్లో చెప్పడం ద్వారా ఉపయోగం వుండదు. ఆచరణే ముఖ్యం. అది లేనప్పుడు ఇవన్నీ కేవలం కాగితాలకు, ప్రచారానికి మాత్రమే పనికొస్తాయి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రాజకీయ పార్టీల నినాదాలకే పరిమితమైందన్నది వాస్తవం. అది కార్యరూపం దాలిస్తే మహిళలకు అంతకంటే కావాల్సిందేముంటుంది? ఆ దిశగా పవన్ కృషి చేస్తే మంచిదే.