గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్ తో ‘నాటు నాటు పాట’ అందరి దృష్టిలో పడింది. ఆర్ఆర్ఆర్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్ సహా.. ఇతర టెక్నీషియన్లు కూడా పాన్ ఇండియా క్రేజ్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు, ఎవరి నోట విన్నా నాటు నాటు. ఈ నాటు నాటు పాటని ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణంలోని అధ్యక్షుడి బిల్డింగ్ ముందు చిత్రీకరించారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటని భారత్ లో ఎందుకు చిత్రీకరించలేదు, షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడానిక కారణం ఏంటి? అనేది రాజమౌళి తన మాటల్లో వివరించారు.
ఆర్ఆర్ఆర్ లో కనిపించే ప్రధాన సెట్టింగ్ లన్నీ ఇక్కడ వేసినవే. రాజప్రాసాదం, ఆయుధాగారం, ఇతరత్రా సెట్టింగ్ లన్నీ ఇక్కడె రెడీ చేశారు. కానీ నాటు-నాటు పాట విషయంలో మాత్రం రాజమౌళి ఉక్రెయిన్ అధ్యక్ష భవనాన్ని సెలక్ట్ చేసుకున్నారు. దీని వెనక ఆసక్తికరమైన విషయాన్ని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
వర్షాకాలం కావడంతో..
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కరోనా వల్ల బాగా ఆలస్యమైన విషయం తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ గ్యాప్ ల మధ్యలో సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాలు ఎప్పుడు అనుమతులిస్తాయా అని ఎదురు చూసిన రోజులవి. ఆ టైమ్ లో సినిమా షూటింగ్ ల అవకాశాన్ని దర్శకులు చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు.
అయితే ఇక్కడ మనకు వర్షాకాలం కావడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి అవకాశం దొరకలేదు. అందులోనూ అది ఓపెన్ ఎయిర్ లో తీయాల్సిన పాట. ఇద్దరు హీరోల డ్యాన్సింగ్ పర్ఫెక్ట్ గా సింక్ కానిదే ఊరుకోరు రాజమౌళి. ఆ పాట షూటింగ్ కోసం చాలా సమయం వెచ్చించాలి. అలాంటి సీజన్లో భారత్ లో పాట చిత్రీకరణకు రిస్క్ చేయలేమని డిసైడ్ అయ్యారు రాజమౌళి. లొకేషన్లు వెదకడం మొదలు పెట్టారు. చివరకు ఉక్రెయిన్ లోని అధ్యక్షుడి బిల్డింగ్ పర్ఫెక్ట్ అని తేలడంతో అందర్నీ తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఆ పాటను అలా పూర్తి చేశారు.
వాతావరణం అనుకూలించక పోవడంతో ప్రత్యామ్నాయం వెదుక్కుని చేసిన ఈ పాట ఇప్పుడిలా పాపులర్ అయింది. భారత్ లోనే ఎక్కడో ఒకచోట సెట్టింగ్ ముందు షూటింగ్ పూర్తి చేసి ఉంటే ఈ స్థాయిలో అది పాపులర్ అయ్యేది కాదేమో అంటారు రాజమౌళి. ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం ఆర్ఆర్ఆర్ కి అలా కలిసొచ్చింది.