రామోజీరావు సిగ్గుపడే స్థాయిలో ఆయన నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక దిగజారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే క్రమంలో, కామాంధులపై అపార గౌరవాన్ని ఈనాడు మీడియా సంస్థ ప్రదర్శించింది. రొమేనియన్ బాలిక అత్యాచార నిందితుల గౌరవాన్ని కాపాడ్డం తన కర్తవ్యంగా ఈనాడు పత్రిక భావించి, వాళ్ల పేర్లను గోప్యంగా వుంచింది. మైనర్ల పేర్లను రాయకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ నిందితుడి తండ్రి తెలంగాణ సర్కార్‌లోని ఓ నామినేటెడ్ పదవిలో ఉండడం విశేషం.
ప్రభుత్వ పరువును కాపాడేందుకే ఈనాడు పత్రిక సదరు నాయకుడి పేరు రాయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగి వుంటే, ఇలాంటి గోప్యతే ఈనాడు పత్రిక పాటించేదా? అనే ప్రశ్న ముందుకొచ్చింది. అందుకే ఈనాడు వైఖరి నిలదీతకు గురైంది.
హైదరాబాద్ నడిబొడ్డున కారులో రొమేనియన్ బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడడం తీవ్ర దుమారం చెలరేగింది. పబ్ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు , అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడు, మరో ఇద్దరు మైనర్లు, పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), బంజారాహిల్స్‌కు చెందిన ఉమేర్‌ఖాన్ ఉన్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు మైనర్ కావడంతో అతని పేరు రాయకపోవడం జర్నలిజం నైతికత.
కానీ ఈనాడు పత్రిక కేసీఆర్ ప్రభుత్వ పరువును కాపాడే క్రమంలో తనను తాను బలిపెట్టుకుంది. పోలీసులు చెప్పినా వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడని ఈనాడు రాయలేకపోయింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా చైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతని స్నేహితులున్నారని రాసుకొచ్చారు. ఈ అత్యాచారం మరక కేసీఆర్ ప్రభుత్వానికి అంటకుండా ఈనాడు పత్రిక ఎంత జాగ్రత్త తీసుకుందంటే…. ఒక ప్రభుత్వ సంస్థ అని రాయడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ ప్రభుత్వమని రాయడానికి ఈనాడు పత్రికకి దమ్ము లేకపోయింది. తెలంగాణలో తన ఆస్తుల్ని కాపాడుకునేందుకు పాలకుడైన కేసీఆర్‌కు లొంగిపోయి, ఇలా నేరస్తుల పరువు కాపాడడమే కర్తవ్యంగా రాతలు రాయడం గమనార్హం. బహుశా ఈ హేయమైన స్థితికి రామోజీ ఆనందంగా ఉంటారని అనుకోలేం.