మెగాబ్రదర్స్ పవన్‌కల్యాణ్, నాగబాబు… ఇద్దరూ ఇద్దరే. పైగా వీళ్లకి సొంత రాజకీయ పార్టీ. జనాన్ని పిచ్చెక్కించడానికి ఇంతకంటే వేదిక ఏం కావాలి? మరోవైపు ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరోగా పవన్‌కల్యాణ్, మెగా బ్రదర్‌గా నాగబాబు. వీళ్లకు సినీ, రాజకీయ అభిమానులు. ఈ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు. ఇప్పటి వరకూ సక్సెస్ కాలేదు. సొంతంగా పోటీ చేసి, నెగ్గడం కష్టమని గుర్తించిన అన్నదమ్ములిద్దరూ ఇతర పార్టీల భుజాలపై గన్ పెట్టి పేల్చాలనే, ప్రయత్నాలకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై మెగాబ్రదర్స్ అభిప్రాయాలు వింటే నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని దుస్థితి. వాళ్లది అజ్ఞానమా? అహంకారమా? అనే అనుమానం కలుగుతుంది. ఎన్నికలకు సమాయత్తం కావడానికి పవన్‌కల్యాణ్, నాగబాబు ఏపీలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ గుంటూరులో జిన్నాటవర్ పేరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జిన్నా దేశ విభజనలకు మూలకారకుడన్నారు. దేశ విభజన వల్ల లక్షల మంది చనిపోయారని, ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని విమర్శించారు. గుంటూరులోని జిన్నాటవర్‌కు ఆ పేరే కావాలని కోరుకునే వారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏ అబ్దుల్ కలాం పేరో పెట్టడం మంచిదని సూచించారు.
గతంలో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చింది తానేనని గర్వంగా చెప్పిన పవన్‌కల్యాణ్‌కు, అప్పుడే జిన్నాపేరు మార్చాలని గుర్తు రాలేదా? ఇప్పుడు జగన్ అధికారంలో వుంటేనే అన్ని గుర్తుకొస్తాయా? అబ్దుల్ కలాంను గౌరవించుకోవాలంటే, జిన్నా పేరు తొలగించాలా? మరెక్కడైనా పెట్టకూడదా? మరీ ముఖ్యంగా కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే, ఆ మహనీయుని ఒక జిల్లాకు పరిమితం చేస్తామా? అని ప్రశ్నించిన పెద్ద మనిషి, అబ్దుల్‌కలాంను మాత్రం ఆ దృష్టితో ఎందుకు చూడడం లేదు? అబ్దుల్‌కలాంను కేవలం ఒక టవర్‌కు పరిమితం చేయాలని అనుకోవడం భావ్యమా? అని ప్రశ్నించే వాళ్లకు సమాధానం ఏంటి పవన్?
పవన్ సోదరుడు నాగబాబు విషయానికి వద్దాం. విద్యాసంస్థల నిర్వాహకుడిగా వున్న పి.నారాయణ ఒక అధ్యాపకుడన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోకుండా అరెస్టు చేసి జైలులో పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా నారాయణ అనే వ్యక్తి విద్యా సేవకుడు కాదు. ఆయనో కార్పొరేట్ విద్యావ్యాపారి. టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్ష ప్రశ్నా పత్రాలను లీక్ చేసినా చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేయడం ఒక్క నాగబాబుకే చెల్లింది.
అయినా జాతిపిత మహాత్మా గాంధీజీని చంపిన గాడ్సేను సోషల్ మీడియా వేదికగా పొగిడిన నాగబాబు… కార్పొరేట్ విద్యా వ్యాపారి నారాయణ గురించి అలా ఆలోచించారంటే పెద్దగా చింతించాల్సిన పనిలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో వింత ధోరణులకు అన్నదమ్ముల కంటే నిలువెత్తు నిదర్శనం మరొకరు లేరు. భరించడం తప్ప ఇప్పట్లో చేయగలిగిందేమీ లేదు.