జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ అజ్ఞానానికి లెక్క తప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషమే, ఆయన రాజకీయ పంథాను గమ్యం లేని లక్ష్యం వైపు నడిపిస్తోంది. జగన్‌ను ఓడించడమే ఏకైక ఆశయంగా పవన్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ప్రశ్నించడానికి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం పార్టీ పెట్టాననే పవన్‌కల్యాణ్ మాటలన్నీ ఉత్తుత్తిదే అని మరోసారి తేలిపోయింది. ఇవాళ మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మనసులో మాట బయట పెట్టారు.
” మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి నష్టం. అందుకే పొత్తులపై నేను ముందుకొచ్చాను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ కలిసి రావాలి. అది ఏ ఒక్కరి నిర్ణయం వల్లో జరగదు. ఏ పార్టీ తరపున వాళ్లే ఈ దిశగా ఆలోచించాలి” అని అన్నారు.
వైసీపీ వల్ల రాష్ట్రానికి నష్టమని పవన్ అనడం వరకూ ఓకే. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే లాభమో చెప్పడానికి భయమేంటి? ఇప్పుడు అందరూ కలిసి రావాలని ఎవరినైతే పవన్‌కల్యాణ్ కోరుతున్నారో, 2014లో వీళ్లే కదా ఐక్యంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేంటి? ఎన్నికలకు ఏడాదిన్నర ఉందనగా ఎవరికి వారుగా విడిపోయారెందుకు? నాడు టీడీపీ, మోదీ సర్కార్‌పై చేసిన విమర్శల సంగతేంటి? ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నారా?
టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే వైసీపీకి భయమెందుకని పవన్ పదేపదే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సంగతి కాసేపు పక్కన పెట్టండి. తమ అభిమాన హీరో, రాజకీయ నాయకుడిని సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తలు, నాయకుల ఆకాంక్ష సంగతేంటి? జగన్‌పై రగులుతున్న విద్వేషాగ్ని, చివరికి జనసేన శ్రేణులు ఆకాంక్షను కూడా దగ్ధం చేసిందా? ఇది రాజకీయ అజ్ఞానం కాదా?
ఒకవైపు పొత్తు వద్దు బాబోయ్ అని టీడీపీ తప్పించుకు తిరుగుతుంటే, కలిసి రావాలని పవన్‌కల్యాణ్ కోరడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనం కాదా? మరోవైపు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలతో పొత్తు వద్దేవద్దని మిత్రపక్షమైన బీజేపీ అంటుంటే… కలిసి రావాలని కోరడం జనసేనాని కోరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ఏ రకంగా చూసినా పవన్‌కల్యాణ్ రాజకీయ పంథా అజ్ఞానంతో సాగుతోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.