నడిరోడ్డుపై హత్య.. అసలు మేటర్ ఇది

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పట్టపగలు హత్య జరిగింది. ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసి ఓ వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి హత్య చేశారు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? ఆ…

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పట్టపగలు హత్య జరిగింది. ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసి ఓ వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి హత్య చేశారు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? ఆ కుటుంబ సభ్యులతో అతడికి ఏంటి సంబంధం? ఈ హత్య వెనక అసలు కారణం ఏంటి?

ముందుగా ప్రేమ..

ఇందారం గ్రామానికి చెందిన యువతి, అదే గ్రామానికి దగ్గర్లో నజీర్ పల్లెలో ఉంటున్న మహేష్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎంతలా అంటే, దాదాపు ఊరు మొత్తం వాళ్లు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలుసు. యువతి కూడా పలుమార్లు ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది.

వేరే వ్యక్తితో పెళ్లి..

అయితే మహేష్ తో తమ కూతురు పెళ్లి జరిపించడానికి ఇష్టపడలేదు కనకయ్య-పద్మ. భార్యభార్త ఇద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు కూతురుకి బ్రెయిన్ వాష్ చేశారు. ఆమె మనసు మార్చారు. అలా మనసు మార్చుకున్న యువతి, కొన్నాళ్లుగా మహేష్ కు దూరంగా ఉంటూ వచ్చింది. మహేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసి, ఇంటికొచ్చినా స్పందించలేదు. ఈ క్రమంలోనే, మరో వ్యక్తికి ఇచ్చి కూతురు పెళ్లి చేశారు  కనకయ్య-పద్మ.

మాజీ ప్రేమికుడి బెదిరింపులు..

ఈ పెళ్లితో మహేష్ మాజీ ప్రేమికుడయ్యాడు. విషయం తెలుసుకున్న మహేష్ కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లయినప్పట్నుంచి యువతిని వేధించడం మొదలుపెట్టాడు మహేష్. అక్కడితో ఆగకుండా.. పెళ్లికి ముందు యువతితో ఏకాంతంగా గడిపిన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలన్నింటినీ సోషల్ మీడియాలో వదిలాడు.

హత్యకు దారితీసిన ఘటన

అక్కడితో ఆగకుండా.. ఆ ఫొటోలు, వీడియోల్ని యువతి భర్తకు కూడా పంపించాడు. అతడ్ని కూడా బ్లాక్ మెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆ భర్త తన భార్య కు దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పట్నుంచి యువతి, తన పుట్టింటికి వచ్చేసింది. అయితే మహేష్ వేధింపులు ఆగకపోవడంతో యువతి భర్త 6 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.

జరిగిన ఘటనలతో ఇటు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, అటు ఆత్మహత్య చేసుకున్న యువతి భర్త కుటుంబీకులు మహేష్ పై ఆగ్రహంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో మరోసారి ఇందారంలోకి యువతి ఇంటికొచ్చాడు మహేష్. అప్పటికే ఆగ్రహంతో ఉన్న యువతి, ఆమె తల్లిదండ్రులు కనకయ్య-పద్మ యువకుడ్ని బైక్ పై నుంచి కిందకు లాగారు.

నడిరోడ్డుపై మహేష్ ను కింద పడేసి కొట్టడం మొదలుపెట్టారు. తనను కాపాడమంటూ మహేష్ కేకలు వేసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఆ ముగ్గురు తమ చేతికి అందిన బండరాళ్లతో మహేష్ తలపై కొట్టడం మొదలుపెట్టారు. దీంతో మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

జరిగిన ఘటనతో యువతితో, పాటు ఆమె తల్లిదండ్రులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వాళ్ల కోసం గాలిస్తున్నారు.