దేవుడికి అలంకరించిన పూలూ, పత్రీ మర్నాటికి నిర్మాల్యం అవుతాయి. తీసేసి కొత్తవి పెడతారు. పాతవాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది పెద్ద సమస్య. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పరిష్కారాన్ని కనుగొంది. అది చాలా ఉత్తమంగా తోచి, అలాటిది ఊరూరా జరగాలని ఆకాంక్షిస్తూ రాస్తున్న వ్యాసమిది.
గతంలో వెంకటేశ్వరుడికి అలంకరించిన పూలను మర్నాడు బావిలో పడేసేవారని చదివాను. ఇప్పుడా పద్ధతి మార్చేసి ఆ పూలతో అగరుబత్తీలు తయారు చేస్తున్నారని ‘‘ఇండియా టుడే’’ 2022 సెప్టెంబరు 19 సంచికలో చదివాను. పథకాలు పెట్టడాల గురించి పేపర్లలో చాలానే చదువుతాం. అమలులో ఎలా ఉంటాయో అనుభవిస్తే తప్ప తెలియదు.
క్రితం నెల తిరుమల వెళ్లినపుడు అగరుబత్తులు కొందామనుకున్నాను. లడ్డూ కౌంటరు పక్కనే పెద్ద క్యూ చూసి జంకాను. బేడీ ఆంజనేయస్వామి మెట్ల దగ్గర ఉన్న స్టాల్లో రష్ లేదని అక్కడ కొన్నాను. ఇంటికి వచ్చి వాడి చూస్తే బ్రహ్మాండమైన సువాసన. ఈ మధ్య కొన్ని అగరుబత్తులు దగ్గు తెప్పిస్తున్నాయి. దీనిలో ఆ సమస్య లేదు. దేవుణ్ని అలంకరించిన పూలు రూపాంతరం చెంది మనింట్లోకి వచ్చాయన్న సెంటిమెంటు ఒకటి. ధర కూడా సరసమే. హైదరాబాదులో డిస్ట్రిబ్యూషన్ ఉందో లేదో తెలియదు. ఆన్లైన్లో తెప్పిద్దామని చూస్తే తిరుమలలో హోం డెలివరీ అనే రాశారు. వేంకటేశ్వరుడికి దేశమంతా భక్తులున్నారు. అందరికీ కావాలంటే సప్లయి చేయడం వాళ్ల తరం కాదేమో! అగరుబత్తుల కోసం ప్రతీసారీ తిరుపతి వెళ్లలేం కదా! తక్కిన గుళ్లల్లో కూడా యిలాటి పద్ధతి మొదలుపెడితే ఎంత బాగుంటుంది అనిపించింది.
కరుణశ్రీ ‘‘పుష్పవిలాపం’’ వింటే పువ్వుల బతుకు ఒక్కరోజే కదాని చాలా బాధ కలుగుతుంది. దేవుడికి అలంకరించిన పూల విషయంలో యీ తేడా మరీ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పూజ చేయబోయే పువ్వు, లేదా గుళ్లో పూజారి అందించిన పువ్వులో రేక కింద పడినా, వెంటనే తీసి, కళ్ల కద్దుకుంటాం. మర్నాడు పొద్దున్న కల్లా అది నిర్మాల్యం. తక్కిన కసవుతో పాటు ఊడ్చి పారేస్తారు. పూజ జరిగిన మర్నాడు పూలదండల గుట్టలు తక్కిన గార్బేజితో పాటు పట్టుకెళ్లిపోతారు. మా కాంప్లెక్స్‌లో వినాయకుడి గుడి ఉంది. ఆలయసమితికి నేను అధ్యక్షుణ్ని. నిర్మాల్యాన్ని వేరే కవర్లో వేసి పెడతాం కానీ చివరకు అది గార్బేజి వ్యాన్లోనే వెళుతుందన్న బాధ ఉంది.
ఈ బాధకు పరిష్కారం లేదు. అనేక పత్రికల మీద దేవుడి బొమ్మలు వేస్తారు. సంచీల మీద వేస్తారు. క్యారియర్ బ్యాగ్‌ల మీద వేస్తారు. పెళ్లి శుభలేఖల మీద వేస్తారు. చింపి తుక్కుబుట్టలో పడేయడానికి మనసు రాదు. అప్పటికీ కొన్నిటిని బుక్మార్కులుగా వాడతాను. ఎన్నని వాడగలం? వినాయక చవితి సమయంలో ఉంటుంది అసలైన అవస్థ. మా కాంప్లెక్స్‌లో విగ్రహం పెట్టి నవరాత్రులు చేస్తాం. ‘నిమజ్జనం రోజున విగ్రహాలు మాత్రమే పట్టుకెళతాం, పత్రి మీరే ఎలాగోలా డిస్పోజ్ చేసుకోండి, విగ్రహంతో పాటు చెఱువులో వేస్తే మాకు పెనాల్టీ పడుతుంది’ అని చెప్తాం. కానీ కొందరు దొంగచాటుగా విగ్రహాలతో పాటు పత్రి పెట్టేసి వెళ్లిపోతారు.
మనవాళ్లకు యిదో జబ్బు. ఇంట్లో ఎక్కువై పోయిన దేవుడి కేలండర్లు, ఫోటోలు, విగ్రహాలు, తాయెత్తులు అన్నీ అందుబాటులో ఉన్న గుడి హుండీలో పడేస్తారు. లేదా ప్రదక్షిణం చేస్తున్నట్లు నటించి, ఓ మూల పెట్టేసి వెళ్లిపోతారు. మీరు ఆలయ నిర్వాహకులైతే తెలుస్తుంది యీ ‘భక్తుల’ మీద పళ్లు పటపటలాడిస్తారు. వీటిని ఎలా వదుల్చుకోవాలో తెలియదు. ఏ ప్రవచనకారుడూ వీటిని ఎలా డిస్పోజ్ చేయాలో సరైన మార్గం చెప్పరు. వినాయక చవితి పత్రి విషయంలో మేమొక మార్గం కనిపెట్టాం. మీ పత్రిని ఎండబెట్టి ఒరుగులా చేసి యిస్తే నిమజ్జనానికి రెండు, మూడు రోజుల ముందు జరిగే హోమాగ్నిలో వేసేస్తాం అని. కానీ కొందరికి అదీ బద్ధకమే. ఎవరూ లేకుండా చూసి చెఱువులో పడేసి వస్తారు, ప్లాస్టిక్ కవరుతో సహా! మునిసిపల్ కార్పోరేషన్ వాళ్లు హెచ్చరించినా పట్టించుకోరు.
చెప్పవచ్చేదేమిటంటే, దేవుడికి సంబంధించిన ప్రసాదం ఆరగించి అవగొట్టేస్తాం కానీ నిర్మాల్యాన్ని ఎలా హరాయించాలో ఎవరికీ తెలియదు. కొన్ని గుళ్ల ప్రహారీ గోడ పక్కన పూలగుట్టలు చూస్తే దిగులుగా ఉంటుంది. నిన్న దేవుడి శిరసుపై ఉన్నావు, యివాళ ధూళిలో కలిశావు కదాని. తులసి మాలలూ అంతే. ఆంజనేయుడికి తమలపాకుల పూజ చేయించినా అంతే. ఏదైనా పండగ వస్తే 1008 తమలపాకులను బోల్డంత ఖరీదు పెట్టి కొని పూజ చేయిస్తాం. పూజారి వంద ఆకులు ప్రసాదంగా యిస్తే ఏం చేయాల్రా భగవంతుడా అని దిగులు వేస్తుంది. మేకలా మేయలేం కదా! రోజుకి ఎన్ని తినగలం? ఫ్రిజ్‌లో పెట్టి తిందామని చూసినా, వాటిలో కొన్ని కుళ్లిపోవడం ఖాయం. పోనీ అలాగని తక్కువ పూలతో, ఆకులతో పూజ చేయిద్దామంటే పుణ్యం ఆ మేరకు తగ్గిపోతుందన్న భయం. అందునా మనకన్నీ 108, 1008 లెక్క! సహస్రనామాలు జపిస్తే తప్ప దేవుడు శాంతించడు. నామానికో పూవో, పత్రమో సమర్పించుకోవాలి కదా! అవసరార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షింతలతో సరిపెడదామంటే, ఆయనా రిటర్న్ గిఫ్ట్ అక్షింతలతో సర్దుకోమంటాడేమోనన్న భయం.
మామూలు గుళ్లల్లోనే పూలగుట్టలు కనబడితే వైభోగానికి మారుపేరైన తిరుమలేశ్వరుడి సంగతేమిటి? రోజుకి 950 కిలోల పూలు వాడతారట. వాటిని మర్నాడు బావిలో పడేస్తే ఏం ప్రయోజనం? అనుకుని ఎవరికి వచ్చిందో కానీ బ్రహ్మాండమైన యీ ఐడియా వచ్చింది. 2021 సెప్టెంబరు నుంచి వాటిని తిరుపతిలోని ఎస్.వి. గోసంరక్షణ శాలకు పంపిస్తున్నారు. తిరుపతి, తిరుమలలోని తక్కిన దేవాలయాల నుంచి కూడా పూలు అక్కడకు చేరుతున్నాయి. మొత్తం 5 టన్నుల పూలట! దర్శన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ డీహ్యుమిడిఫైయర్ను విరాళంగా యిచ్చింది. అది పూలలో తడిని హరిస్తుంది కానీ వాటి రంగును, సువాసనను అలాగే ఉంచుతుంది. 80 మంది పనివాళ్లు ఆరిన పూలను వర్గీకరించి, వాటిని పొడి చేసి, దానికి నీరు చేర్చి, అగరుబత్తులుగా మారుస్తారు. మూడు బ్రాండ్లు పూలవి, నాలుగు సువాసనవి, మొత్తం ఏడు రకాలు!
http://ttdseva.in/ttd-incense-sticks-agarbatti/ ప్రకారం 2021 సెప్టెంబరు నాటికి అక్కడ 10 యంత్రాల ద్వారా రోజుకి 3.5 లక్షల అగరుబత్తులు చేస్తున్నారని రాశారు. ఏడాది తర్వాత వచ్చిన ఇండియా టుడే వ్యాసంలో రోజుకి పది లక్షలు చేస్తున్నారని, డిమాండు పెరగడంతో 2022 అక్టోబరు నుంచి ఉత్పత్తి రెట్టింపు చేస్తారని రాశారు. సంతోషమేమిటంటే యిదంతా టిటిడి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఆ వ్యాసంలో టిడిడి ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఆర్గానిక్ ఉత్పాదనలు ఎలా చేస్తోందో, గోశాల నుంచి వచ్చిన పంచగవ్యాలతో స్వామి సేవ ఎలా జరుగుతోందో, నమామి గోవింద పేరుతో ఔషధ ఉత్పత్తులు ఎలా అందుబాటులోకి తెస్తోందో, ఏయే సంస్థల సహకారంతో యివన్నీ సాగుతున్నాయో ‘‘ద గాడ్స్ గో గ్రీన్’’ అనే ఆ వ్యాసంలో వివరంగా రాశారు. గోశాల ఎంత బాగా నిర్వహిస్తున్నారో, ఎలా విస్తరిస్తున్నారో కూడా రాశారు. ఓపికుంటే చదవవచ్చు.
సిరికలవానికి చెల్లును అన్నట్లు వెంకటేశ్వరుడికి అవన్నీ చెల్లుతాయి. మామూలు దేవుళ్ల విషయంలో కనీసం వారి నిర్మాల్యం విషయంలోనైనా న్యాయం జరగాలని నా కోరిక. ఏదైనా స్టార్టప్ కంపెనీ, ఊళ్లోని గుళ్లన్నిటి నుంచి పూలు సేకరించి ఏదైనా అగరుబత్తి కంపెనీకి అందచేస్తే, వాళ్లు నిర్మాల్యం నుంచి చేసిన అగరుబత్తులుగా మార్కెట్ చేసి కాస్త ఎక్కువ ధరకైనా అమ్మవచ్చు. మామూలుగా అయితే కెమికల్స్ వాడతారు. ఇవి ఆర్గానిక్, పైగా పూజాసామగ్రితో చేస్తున్నవి అంటే కాదని ఎవరంటారు? వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. వాటికున్న అనుభవంతో పూల వేస్టుతో యిలాటిది చేస్తే పుణ్యం, పురుషార్థం కూడానూ. గంగ నీళ్లు కలిపామని చెప్పి సబ్బులు అమ్ముకున్న వైనం చూశాం. తమిళనాడులో కొన్ని బ్రాండ్ల వాళ్లు ‘బ్రాహ్మల చేత చేయబడిన అప్పడములు’ అని అమ్ముతారు. వాటివలన రుచేమైనా పెరుగుతుందా!? అంతకంటె నిర్మాల్యం అగరుబత్తులు బెటరు కాదూ? పైగా పూజ చేసేటప్పుడు అలాటివి వాడితే ఒక రకమైన మానసిక తృప్తి కూడా ఉంటుంది కదా!
ఊరూరా యిలాటి ప్రయత్నాలు జరిగితే మంచిది. గుళ్లో నిర్మాల్యానికంటూ ఓ తొట్టె ఏర్పాటు చేస్తే మన యిళ్లల్లో పెద్ద పూజలేవైనా చేయించుకున్నపుడు వెలువడే నిర్మాల్యాన్ని అందులో పడేయవచ్చు. వినాయక చవితి సమయాల్లో టన్నుల కొద్దీ వెలువడే పత్రి నిర్మాల్యాన్ని కూడా యంత్రాల ద్వారా డ్రై చేసి హోమాల్లో సమిధలకు బదులు వాటిని వాడితే చెట్లు కొట్టడాలు తగ్గుతాయి. ఆ దిశగా ఆలోచించడం మొదలుపెడితే వైద్యులకు, పర్యావరణకారులకు ఎన్నో ఐడియాలు వస్తాయి. ఎలాగోలా నిర్మాల్యాన్ని పనికిరాని చెత్తగా చూసే పద్ధతి పోతే అంతే చాలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)