తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ఉనికిని టీడీపీ అనుకూల కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుతో అంటకాగుతున్న నాయకులే షర్మిల విషయానికి వచ్చే సరికి…ఆమె ఆంధ్రా నేత కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల అంటే ఎవరో తనకు తెలియదని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
రేణుకాచౌదరి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పోటీ చేస్తానని ప్రకటించడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రేణుకా చౌదరి స్పందిస్తూ… షర్మిల అంటే ఎవరో కూడా తనకు తెలియదని తన మార్క్ వెటకారాన్ని ప్రదర్శించారు. షర్మిలది ఆంధ్రా… వాళ్ల అన్న అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రాష్ట్రమంతా వదిలి ఖమ్మంలోనే షర్మిల ఎందుకు ఉన్నారని ఆమె ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా పని చేస్తామన్నారు. రాహుల్‌గాంధీ ఖమ్మం సభ తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో భయం మొదలైందన్నారు.
కేసీఆర్ అనుకూల నాయకుడైన కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేశారన్నారు. రాహుల్‌గాంధీ చెప్పినట్టు తెలంగాణలో కనీసం మూడో స్థానం కూడా బీజేపీకి దక్కదన్నారు. ఇదిలా వుండగా షర్మిలపై సెటైర్స్ వేసిన రేణుకాకు నెటిజన్లు నుంచి అదే రీతిలో ఎటాక్ తప్పడం లేదు.
అమరావతి రాజధాని పోరాటానికి ఏ ప్రాతిపదికన రేణుకాచౌదరి మద్దతు ఇస్తున్నారో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కులం ప్రాతిపదికన ఆంధ్రాకు వచ్చి, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇతరులను ప్రాంతీయ ప్రాతిపదికన విమర్శిస్తున్నప్పుడు, తనకు కూడా అదే వర్తిస్తుందని గుర్తించుకోవాలని హితవు చెబుతున్నారు.