ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లుగా ఉంటుంది. ఆ నిర్ణయాలతో ప్రతిపక్షాలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడటానికి అవకాశం కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి రాగానే తాను తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం గురించి బహిరంగంగానే చెప్పాడు కూడా. ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్రాన్ని రణరంగం చేయడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయం చెప్పాడు. రేవంత్ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యమించడం ఖాయమన్నాడు.
అసలు ఆ నిర్ణయం తీసుకుంటాడో, తీసుకోడో తెలియదు. కాని తీసుకుంటాడనే ప్రచారం మాత్రం జరుగుతోంది. అదే… జిల్లాల పునర్విభజన. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఉమ్మడి ఏపీలోనూ అన్నే జిల్లాలు ఉన్నాయి. అప్పట్లో ఏపీలో 13 జిల్లాలు ఉండేవి. జగన్అధికారంలోకి వచ్చాక 26 జిల్లాలు చేశాడనుకోండి. కేసీఆర్ అధికారంలోకి రాగానే 10 జిల్లాలను 33 జిల్లాలు చేశాడు. పాత జిల్లాలను ఒక్కోదాన్ని మూడు నాలుగు జిల్లాలుగా చేశాడు. పాత జిల్లాలకు అలవాటు పడిన జనానికి ఇన్ని జిల్లాలు కన్ఫ్యూజన్గా ఉండేవి. ఐఏఎస్, ఐపీఎస్అధికారుల కొరత కూడా ఏర్పడింది. చాలా సమస్యలు వచ్చాయి. భవనాల కొరత ఏర్పడింది. ఇన్ని జిల్లాలు చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
ఉన్నతాధికారులు కూడా ఇంత చిన్న జిల్లాల్లో ఏం పరిపాలన చేస్తామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్దుబాటు కూడా కష్టమైంది. 10 జిల్లాలను విభజించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ నాయకులు మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటే మా ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. రకరకాల సెంటిమెంట్లు ముందుకు తెచ్చి కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016 అక్టోబరు 11 న ప్రభుత్వం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీనితో మొత్తం జిల్లాల సంఖ్య 31 అయింది. 2016 ఆగస్టు 22 న 17 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్థీకరణకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. నెల రోజులలో ఏమైనా అభ్యంతరాలను ఉంటే తెలపాలని ప్రజలను కోరింది.
ప్రభుత్వం నియమించిన కేశవరావు కమిటీ సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాదు, జనగామ అనే మరో 4 జిల్లాల ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. ఈ 4 జిల్లాలను కూడా ఏర్పాటు చేసే వీలు కల్పిస్తూ ప్రభుత్వం, 2016 అక్టోబరు 7 న ఒక ఆర్డినెన్సు ద్వారా తెలంగాణ రాష్ట్ర జిల్లాల ఏర్పాటు చట్టం 1974 ను సవరించింది. 21 కొత్త జిల్లాలతో, మొత్తం 31 జిల్లాలతో, 2016 అక్టోబరు 11 న తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తైంది. ఆ తరువాత రెండు కొత్త జిల్లాలు ఏర్పడటంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. మండలాలు, రెవన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది. ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ దాన్ని పూర్తిగా సమర్ధించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుందని, కాబట్టి ఎక్కవ నిధులు వచ్చే అవకాశం ఉంటుందని అప్పట్లో చెప్పుకొచ్చాడు. పరిపాలన ప్రజల ముంగిటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వారికి భారం తగ్గుతుందని అన్నాడు.
కాని కేసీఆర్ చెప్పినట్లు కేంద్రం జిల్లాల ప్రాతిపదికన నిధులు ఇస్తున్నదో లేదో తెలియదు. కేసీఆర్ అధికారంలో ఉండగా తీసుకున్న చాలా నిర్ణయాలను, చేసిన పనులను విమర్శించినట్లే రేవంత్ రెడ్డి జిల్లాల విభజనను కూడా వ్యతిరేకించాడు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కాబట్టి తాము శాస్త్రీయంగా పునర్విభజన చేస్తామని చెప్పాడు. ఇన్ని జిల్లాలు అనవసరమన్నాడు. దీంతో కేసీఆర్‌కు ఒళ్లు మండిపోయింది. తాను ఎంతో శాస్త్రీయంగా జిల్లాల విభజన చేశానన్నాడు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆయా జల్లాల్లో ఉండే గ్రోత్ ఇంజన్స్ ఏమిటనేది దృష్టిలో పెట్టకొని జిల్లాల విభజన జరిగిందని చెప్పాడు.
జిల్లాల విభజన అల్లాటప్పాగా చేయలేదని, అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొనే చేశామని చెప్పాడు. ఎన్నికల ప్రచారం చేసినప్పడు ‘రేవంత్ మీ జిల్లాను ఎత్తేస్తడంట…మీరు ఒప్పకుంటరా?’ అని ప్రతి జిల్లాలోనూ ప్రజలను ప్రశ్నించాడు. జిల్లాలను తగ్గిస్తే ఊరుకోబోమని, రేవంత్‌కు సత్తా చూపిస్తామని హెచ్చరించాడు.
సో…ఇప్పడు ఉద్యమం చేయడానికి కేసీఆర్‌కు మంచి సబ్జెక్టు దొరికింది. రేవంత్ నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజల భావోద్వేగాలను, వాళ్ల సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. 33 జిల్లాలను 17 జిల్లాలు చేయాలనే ప్లాన్‌లో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సగం జిల్లాలు రద్దవుతాయి. జిల్లాల పునర్విభజన కోసం ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎన్నికల కోడ్ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని సమాచారం. ఏపీలో మాదిరిగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికను జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అసలు ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియ మొదలుపెడితేగాని పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది.