విశాఖలోని బర్మా కాలనీలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమారు అన్న కారణం చేత 41 ఏ కింద ఉత్తరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి విష్ణు కుమార్ రాజుకు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన స్టేషన్ కి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల పక్షాన ఉండడం తప్పా అని విమర్శించారు. తాను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ తప్పు చేయలేదని ఆయన అంటున్నారు. అయితే ఒక వ్యక్తిగత వివాదాన్ని తీసుకుని వచ్చి మీడియా మీటింగ్ పెట్టి వైసీపీ అరాచకం అంటూ ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ఎన్నికల్లో కూటమికి ఓట్లు వేసినందుకే బాధితులను కొట్టారని రాజు ఆరోపించారు. దాని మీద విశాఖ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో చేసిన విచారణ అనంతరం కేవలం వ్యక్తిగత గొడవలకే దాడికి కారణం అని తేలింది. ఈ సందర్భంగానే రాజుకు నోటీసులు ఇచ్చి స్టేషన్ కి పిలిపించామని విశాఖ పోలీసులు చెబుతున్నారు.
ఏపీలో పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఎక్కడ చూసినా సున్నితంగానే ఉంది. ఈ సమయంలో రాజు అధికార పార్టీ మీద రాజకీయ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ముందూ వెనకా చూసుకోకుండా ఇదంతా వైసీపీ గూండాల పని అని స్పందించేశారు. దీని మీద వైసీపీ ఉత్తరం నియోజకవర్గం అభ్యర్ధి కేకే రాజు మాట్లాడుతూ వైసీపీని అభాసుపాలు చేయడానికే ఇదంతా చేశారు అని మండిపడ్డారు.
బీజేపీ రాజు మీడియా ముందు చేసిన అతి ఫలితమే ఇదంతా అని అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు దూకుడుగా చేస్తే కొన్ని సార్లు బూమరాంగ్ అవుతాయని అంటున్నారు.