“నేను ఎక్కడికీ వెళ్లలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను, ఓ ఫామ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తున్నాను. ఛిల్ అవుతున్నాను. నా మీద వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్.”
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పేరు బయటకు రావడంతో సదరు నటి ఇలా ఓ వీడియో రిలీజ్ చేసింది. తను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్, బెంగళూరు పోలీసులు విడుదల చేసిన హేమ ఫొటోలో డ్రెస్ ఒకటే.
దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలు నిజమేనంటున్నారు పోలీసులు. తను హైదరాబాద్ లో ఛిల్ అవుతున్నానంటూ హేమ పెట్టిన వీడియోను కూడా బెంగళూరు శివార్లలోని ఫామ్ హౌజ్ లోనే షూట్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఫామ్ హౌజ్ లోని ఆ స్పాట్ కు సంబంధించి పోలీసులు రిలీజ్ చేసినట్టుగా చెబుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీఆర్ ఫామ్ హౌజ్ లో నిన్న రాత్రి ఈ రేవ్ పార్టీ జరిగింది. ఆంధ్రాకు చెందిన ఓ బిల్డర్ కొడుకు వాసు ఈ పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి దాదాపు 40 మంది మహిళలు హాజరైనట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో సినీ తారలు, మోడల్స్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు కనుగొన్నారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్ తో పాటు, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన కొంతమంది వ్యక్తుల నుంచి సెల్ ఫోన్లు, 15 కార్లను సీజ్ చేశారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫోరెన్సిక్ నిపుణుల్ని కూడా పిలిపించి, కొంతమంది నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు.