ఊహించని విధంగా నటుడు శ్రీకాంత్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకొచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో శ్రీకాంత్ ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు అది నిజమేనంటూ వార్తలు కూడా వేసేశాయి. కానీ తనకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు శ్రీకాంత్.
హైదరాబాద్ లో తన ఇంటి నుంచి బయటకొచ్చి మాట్లాడిన వీడియోను శ్రీకాంత్ రిలీజ్ చేశాడు. తను హైదరాబాద్ లో, తన ఇంట్లో ఉన్నానని, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తనపై వార్తను ప్రసారం చేసేముందు ఓసారి నిర్థారించుకోవాలని మీడియాను కోరాడు.
“బెంగళూరు రేవ్ పార్టీలో శ్రీకాంత్ ఉన్నట్టు వార్తలు చూసి ఇంట్లో వాళ్లతో కలిసి నేను నవ్వుకున్నాను. మొన్నటికిమొన్న నా భార్యతో నాకు విడాకులిప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీలో దొరికినట్టు చెబుతున్నారు. నేను హైదరాబాద్ లో నా ఇంట్లోనే ఉన్నాను.”
ఈసారి మాత్రం మీడియా అత్యుత్సాహంలో అర్థం ఉందంటున్నాడు శ్రీకాంత్. రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తుల్లో ఒకతను అచ్చం తనలానే ఉన్నాడని, అది చూసి నేను కూడా షాక్ అయ్యానని, మీడియా కూడా పొరపడిందని చెప్పుకొచ్చాడు.
“రేవ్ పార్టీలు, పబ్ పార్టీలకు వెళ్లే మనిషిని కాదు నేను. ఒక్కోసారి తెలియకుండా అలాంటి పార్టీలకు వెళ్లినా 30 నిమిషాల్లో వెనక్కు వచ్చేస్తాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు.”
రేవ్ పార్టీలో శ్రీకాంత్ అంటూ తనపై యూట్యూబ్ లో పెట్టిన థంబ్ నెయిల్స్ ను తీసేయాలని శ్రీకాంత్ రిక్వెస్ట్ చేశాడు.