యూత్ కు రీల్స్ పిచ్చి పట్టుకుంది. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజైన ఓ వీడియో కూడా అలాంటిదే. హైదరాబాద్ లో రద్దీగా ఉన్న యూసఫ్ గూడ రోడ్డు అది. ఓ ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఉన్నట్టుండి ఓ యువకుడు బస్సుకు అడ్డంగా వచ్చాడు. రోడ్డుపై పడుకున్నాడు. అతడి పై నుంచి బస్సు వేగంగా దూసుకుపోయింది.
బస్సు వెళ్లిన తర్వాత ఎంచక్కా లేచి నిల్చున్నాడు. ఒంటిపై దుమ్ము దులుపుకొని పక్కకెళ్లిపోయాడు. ఈ వీడియో చూసినోళ్లకు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఆ పని చేసిన కుర్రాడ్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చివాట్లు పెడుతున్నారు.
నిజానికి అది ఒరిజినల్ వీడియో కాదు. ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఓ ఆకతాయి చేసిన ఫేక్ వీడియో అది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి పనులు ఎక్కువయ్యాయి యువతకి.
అయితే అతడు సరదా కోసం చేసినప్పటికీ సజ్జనార్ మాత్రం సీరియర్ అయ్యారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు టీజీఆర్టీసీ బాస్.
“సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.”
లైకుల కోసం ఆ ఆకతాయి చేసిన పని ఇప్పుడతడికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సజ్జనార్ ఊరికే వదిలేసే రకం కాదు, కచ్చితంగా ఆ కుర్రాడిపై చర్యలుంటాయి. సో.. ఇకనైనా సోషల్ మీడియాలో ఏదైనా వీడియో లేదా కామెంట్ పెట్టినప్పుడు బాధ్యతగా ఉండాలి.