వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల ఆమె ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ అవినీతిపై సీబీఐ, కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా ఆమె ఢిల్లీకెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ భారీగా అవినీతికి పాల్పడిందని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఇవాళ ఆమె కాగ్ ఆడిటర్ జనరల్ గిరీష్ ముర్ముకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రాజెక్టులోని అవినీతిని నిగ్గుతేల్చి, సంబంధిత వ్యక్తుల చర్యలను బయట పెట్టాలని షర్మిల కోరారు.
తన అన్నకు స్నేహితులైన కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల పదేపదే అవినీతి ఆరోపణలు చేయడం విశేషం. షర్మిల ఆరోపణల వెనుక వ్యూహం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది. టీఆర్ఎస్‌పై షర్మిల ఓ రేంజ్‌లో ధ్వజమెత్తుతున్నారు. కానీ అటు వైపు నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. షర్మిలను పట్టించుకోవడం ద్వారా ఆమె ఇమేజ్‌ను పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదు.
ఇటీవల వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని షర్మిల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. షర్మిల ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు చర్యలు తీసుకుంటుందో, రాజకీయంగా షర్మిలకు ఏ మేరకు లాభిస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.