నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మగతనంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. ఇవాళ గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. వరంగల్‌లో పాదయాత్రను అడ్డుకోడానికి ప్రధాన కారణం… టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వ్యక్తగతంగా పరుష వ్యాఖ్యలు చేయడమే కారణమనే ప్రచారాన్ని షర్మిల దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లారు.
తనను మరదలు అని నీచంగా మాట్లాడిన నీచ మంత్రిని చెప్పుతో కొడతాననే మాట తప్ప, ఇంత వరకూ తానెప్పుడు పరుష పదజాలాన్ని వాడలేదని చెప్పుకొచ్చారు. మీ చెల్లో, అక్కో, మరే ఆడబిడ్డను ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? అని షర్మిల నిలదీశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మగతనంపై వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే పాదయాత్రపై దాడికి పాల్పడ్డారనే ప్రచారాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు షర్మిల సీరియస్‌గా స్పందించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి గురించి తాను ఆ మాట అనలేదన్నారు. ఒకవేళ తాను ఆయన మగతనంపై కామెంట్స్ చేసినట్టు వుంటే వీడియో చూపాలని మీడియా ప్రతినిధులను కోరారు. పెద్ది మగతనం సంగతి తనకెందుకని అన్నారు. అదేదో పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆయన భార్య చూసుకుంటారని సెటైర్ విసరడంతో అందరూ ఒక్కసారిగా నవ్వులు కురిపించారు.
పాదయాత్ర వల్ల తమ పార్టీకి గ్రాఫ్ పెరుగుతోందన్న సమాచారంతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని పోలీస్ స్టేషన్లో ఇష్టానుసారం కొట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకే తనను అరెస్ట్ చేయడానికి కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. తానేం నేరం చేశానని కస్టడీకి అడిగారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని షర్మిల విమర్శించారు. కేసీఆర్ ఓ డిక్టేటర్, ఓ దొర మాదిరిగా పాలిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు షర్మిల చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపేది లేదని ఆమె తేల్చి చెప్పారు. పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, తమకేం జరిగినా కేసీఆర్ బాధ్యత వహించాల్సి వుంటుందని ఆమె హెచ్చరించారు.