తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే సోదరి షర్మిల తన మార్క్ సెటైర్స్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్ అన్యోన్యతను గుర్తు చేస్తూ ఆమె వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కేసీఆర్ను దెప్పి పొడిచారు. వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంకు వరద వచ్చిందంటే దానికి ముమ్మాటికీ సీఎం కేసీఆరే కారణమన్నారు.
భద్రాచలానికి గోదావరి వరద వచ్చిందంటే దానికి ముమ్మాటికీ సీఎం కేసీఆరే కారణమన్నారు. భద్రాచలానికి కరకట్ట లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడో సీఎం అయిన కొత్తలో భద్రాచలం వెళ్లారన్నారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు వరద వచ్చిన వారం తర్వాత దొరగారు తీరిక చేసుకుని వెళ్లారన్నారు. ఒక్కర్నీ కూడా పరామర్శించలేదన్నారు. బాధితులతో మాట్లాడలేదన్నారు. మీకేం కావాలి? మీ కష్టం ఏంటని అడిగింది లేదన్నారు. కట్టమీద ఆయన మాత్రమే నిలబడి పిట్టకథలు చెప్పారన్నారు. విదేశీ కుట్ర ఉందని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారన్నారు. క్లౌడ్ బరస్ట్ అన్నారని షర్మిల గుర్తు చేశారు.
అయితే కేసీఆర్ కేబినెట్లోని మంత్రి పువ్వాడ మాత్రం పక్క రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం వల్లే వరద వచ్చిందన్నారని గుర్తు చేశారు. పోలవరమే సమస్య అయితే, అది మీకు ముందు కనిపించలేదా? అని షర్మిల ప్రశ్నించారు. మీరు ముందు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు బాగుందని గతంలో ఎందుకు మెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఆ ముఖ్యమంత్రి (వైఎస్ జగన్)తో మీరు దోస్తీ చేసినప్పుడు, ఇంటికి పిలిపించుకున్నప్పుడు, స్వీట్లు తినిపించుకున్నప్పుడు ,కౌగిలించుకున్నప్పుడు ఎందుకు మాట్లాడుకోలేదని వ్యంగ్యంగా మాట్లాడుతూ నిలదీశారు.
తీరా ఇప్పుడు వరద ముంపు వచ్చిన తర్వాత ఆ నెపాన్ని కప్పి పుచ్చుకోడానికి, తప్పించుకోడానికి సాకులు చెబుతున్నారని కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మీరు, మీరు (కేసీఆర్, జగన్) కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదని షర్మిల నిలదీశారు. మీరు మీరు ఫ్రెండ్స్, కౌగిలించుకుంటారు, అన్నీ చేసుకుంటారని, మరి పోలవరం వల్ల సమస్య గురించి ఎందుకు మాట్లాడుకోలేదని నిలదీశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తప్పించుకోకపోవడానికి కాకపోతే ఇదేంటని ఆమె ప్రశ్నించారు.
మొదటి షర్మిల తన అన్నను కూడా తెలంగాణ రాజకీయాల్లోకి లాగారు. కేసీఆర్తో జగన్ స్నేహాన్ని ప్రస్తావిస్తూ, టీఆర్ఎస్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల ప్రయత్నించారు. తెలంగాణలో షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాను మాత్రం వైఎస్సార్సీపీ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోఒచించాలని షనర్మిల భావించినట్టున్నారు. అందుకే మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగానే ఆంధ్రా సీఎంతో కేసీఆర్ స్నేహం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చారనే రీతిలో షర్మిల ఘాటు విమర్శలు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్తో జగనన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ, రాజకీయంగా లబ్ధి పొందేందుకు షర్మిల ఏ మాత్రం వెనుకాడరనేందుకు ఇవాళ్టి ప్రెస్మీటే నిదర్శనం.