రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణలోని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా, ఎన్‌డీఏ కూటమి తరపున ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ సహా మెజార్టీ ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఆ రాష్ట్రానికి చెందిన 119 ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి చెందిన కందకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీందర్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో హక్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మహీందర్‌రెడ్డితో పాటు అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలా వుండగా తమ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బదులు ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేయడం చర్చనీయాంశమైంది. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ. సీతక్క కూడా అదే సామాజిక వర్గం కావడంతో చర్చకు దారి తీసింది. తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారుల దృష్టికి సీతక్క తీసుకెళ్లారు. మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీతక్క కోరడం గమనార్హం.
అయితే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడంతో సీతక్క నిరాశ చెందారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన వైపు నుంచి పొరపాటు జరగడాన్ని మీడియాతో సీతక్క పంచుకోవడం విశేషం.