ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులే కాదు, సామాన్యులు ప్రధానంగా తెలుగువారు చాలామంది బాధపడుతున్నారు. పార్టీలకతీతంగా రాజ్యసభ సభ్యులు కూడా విచారిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు అందరి హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా ఆయన మాటతీరు చాలామందిని ఆకట్టుకుంటుంది.
మాతృభాష తెలుగులోనే కాకుండా హిందీలో, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడే సత్తా వెంకయ్య సొంతం. ఆయన ప్రసంగాలు ఎక్కడా విసుగు తెప్పించవు. ఆయన ఉపన్యాసాలలో చమక్కులు, చమత్కారాలు పుష్కలంగా ఉంటాయి. ఆయన ఏ భాషలో మాట్లాడినా ప్రాసలు తప్పనిసరిగా ఉంటాయి. వెంకయ్య ఏ అంశంపై మాట్లాడినా ఆయన తప్పనిసరిగా ఒక విషయం చెబుతారు.
మాతృ భూమిని, మాతృ భాషను ప్రేమించాలని, కన్నవారిని గౌరవించాలని తప్పనిసరిగా చెబుతుంటారు. జనం ముఖ్యంగా తెలుగువారు వెంకయ్య చక్కటి ప్రసంగాలను మిస్ అవుతున్నారనే చెప్పుకోవాలి. వెంకయ్య నాయుడిది. దాదాపుగా అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం. ఏబీవీపీ కార్యకర్తగా మొదలు పెట్టి బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా..ఉప రాష్ట్రపతి వరకు ప్రస్థానం కొనసాగింది. వ్యాక్చాతుర్యంతో అందరిలోనూ మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా నిబద్దత కలిగిన పార్టీ కార్యకర్తగా ఒకే పార్టీలో తొలి నుంచి కొనసాగిన అరుదైన నేతగా నిలిచారు. ఇప్పటికీ రాజకీయంగా వెంకయ్య యాక్టివ్ గానే కనిపిస్తారు. ఉప రాష్ట్రపతిగా ..రాజ్యసభ ఛైర్మన్ గా సభా నిర్వహణ..సభ్యుల నియంత్రణలో పూర్తి పట్టు ఉన్న నేత ఆయన.
ఒకసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెంకయ్యను ఉద్దేశించి …మీరు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పటికీ మీ మనసంతా టీడీపీ మీదనే ఉందని సభలోనే వ్యాఖానించారు. నిజానికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వెంకయ్య నాయుడిని ఉద్దేశించి అలా అనడం తప్పు. విజయసాయి రెడ్డి అలా అన్నందుకు వెంకయ్య ఆయన మీద చర్య తీసుకోవచ్చు. కానీ ఉదారంగా వదిలేశారు. అయిదు సంవత్సరాల క్రితం అనూహ్య పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా నియమితులైన వెంకయ్య..నాడు రాజ్యసభలో బీజేసీ సంఖ్యా బలం తక్కువగా ఉండటం.. కీలక అంశాల కు ఆమోదం పొందటం అవసరం కావటంతో పాటుగా.. దక్షిణాదికి ప్రాధాన్యతలో భాగంగా.. పార్టీ సీనియర్ నేత వెంకయ్య కు అరుదైన పదవితో గుర్తింపు దక్కింది.
పార్లమెంటు సమావేశాల మధ్యలోనే ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్ గా.. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య పదవీ కాలం ముగియనుంది. అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న థండక్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య భవిష్యత్ రాజకీయ అడుగుల పైన చర్చ మొదలైంది. మోదీ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసారాలు తదితర శాఖలను నిర్వహించారు.
నిజానికి వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి చేపట్టడం ఇష్టం లేదు. ఆయన్ని క్రియాశీలక రాజకీయాల నుంచి కనుమరుగు చేయడానికే ప్రధాని మోడీ వెంకయ్యను బలవంతంగా ఉపరాష్ట్రపతి చేశాడంటారు. రాజ్యంగ పదవిలో ఉండటంతో ఆయన రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ పడింది. ఉప రాష్ట్రపతి పదవి నిర్వహించిన తరువాత రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయిన నేతలు ఎవరూ ఇప్పటి వరకు కనిపించలేదు.
కానీ, వెంకయ్యకు రాజకీయంగా ఉండే ఆసక్తి తో ఆయన తన పదవీ విరమణ చేసిన తరువాత ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉప రాష్ట్రపతి పదవి తరువాత రాష్టపతి పదవి. ఆ పదవికోసం ముర్మును ఎంపిక చేసారు. ఇక, ఉన్నత పదవులు వెంకయ్యకు దక్కేవి ఏవీ లేవనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో వెంకయ్య రాజకీయాలకు ఇక దూరం కావాల్సిందేనా అనేది చర్చకు కారణమవుతోంది.
ఇప్పటికే ఆయన కుటుంబం స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా సేవా రంగంలో ఉండటంతో..ఆయన సైతం అదే బాటలో ముందుకు వెళ్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత తాను సేవా రంగంలో ఉంటానని వెంకయ్య గతంలో ఓసారి అన్నారు.
ఉపరాష్ట్రపతి పదవి నుంచి పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య కోసం కొత్త ఇంటిని ఢిల్లీలో కేటాయించింది ప్రభుత్వం. వెంకయ్యనాయుడుకు చాణక్యపురిలోని 1, రాజ్‌దూత్ మార్గ్‌లో బంగళాను కేటాయించారు, ఇప్పటికే ఆ బంగళాకు మరమ్మతులు పూర్తి చేయించారు. ఆగస్టు 10న పదవీవిరమణ చేసిన వెంటనే.. ఆయన ఆ ఇంటికి మారనున్నారు. అయితే, ఆయన సొంత రాష్ట్రం ఏపీ కాగా, ఆయనకు రాజకీయంగా మద్దతిచ్చిన రాష్ట్రం కర్ణాటక.
పదవులు లేకపోయినా.. తెలుగు వ్యక్తిగా.. తెలుగు వాళ్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని వెంకయ్య సన్నిహితులు చెబుతున్నారు. అంటే ఆయన మళ్ళీ హైదరాబాదుకో, సొంత ఊరు నెల్లూరుకో వెళ్ళిపోతారా? లేకపోతే ఢిల్లీలోనే ఉండిపోతారా?