తెలంగాణ రాష్ట్ర కమలదళంలో స్ట్రీట్ ఫైట్ నడుస్తోంది. నాయకులు రోడ్డు మీద పడి కొట్టుకోవడం లేదు గానీ.. అక్షరాలలో, మాటల్లో స్ట్రీట్ ఫైట్ నే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారధిగా కిషన్ రెడ్డిని తప్పించి మరొకరికి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం నేపథ్యంలో, ఆ పదవిని ఆశిస్తున్న వారు.. అలాంటి వారిని వ్యతిరేకిస్తున్న వారి మధ్య ఈ ముఠా తగాదాలు రచ్చకెక్కుతున్నాయి.
సుదీర్ఘమైన చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తూ సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి పని చేస్తున్న వారికే పదవి దక్కాలనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. కొంతకాలం కిందటే వేరే పార్టీలలో గతిలేక తమ పార్టీలోకి వచ్చి పదవులను కూడా పొందిన వారికి పార్టీ సారథ్యం అప్పగించవద్దు అని కూడా కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు మధ్య మాటల యుద్ధం మొదలైంది.
కేంద్ర మంత్రి పదవిని ఆశించిన ఈటల రాజేందర్ కు ఈ దఫా భంగపాటు తప్పలేదు. అయితే ఆయనకు రాష్ట్ర పార్టీ సారధ్యం అప్పగిస్తామని 2028 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మరింతగా బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అప్పగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. కాగా దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే అగ్రెసివ్ నాయకుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో సందేశం ద్వారా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
రాజాసింగ్ వీడియో సూటిగా తనను ఉద్దేశించింది కాకపోయినప్పటికీ ఈటల ప్రతిస్పందించడం గమనార్హం. ‘ఫైటర్ కు పదవి ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి ఇవ్వాలి? స్ట్రీట్ ఫైటర్ కు ఇవ్వాలా?’ అంటూ ఈటల రాజాసింగ్ మాటలను ఎద్దేవా చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని అలాంటి వాడే ఫైటర్ అవుతాడని అంటున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని, సందర్భం వచ్చినప్పుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నవాడినని చెప్పుకోవడం ద్వారా బిజెపి అధ్యక్ష పోరులో తాను ఉన్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు.
వీరి గొడవ ఇలా ఉంటే బిజెపి సారధ్యం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా పార్టీ సారధ్యాన్ని కోరుకున్నట్లుగా తెలుస్తోంది, మరి భాజపా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి!