వైసీపీ హయాంలో ఎర్రమట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగింది. వైసీపీ హయాంలో సామాన్యులకు ఇసుక, మట్టి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ ఓటమికి ఇవి కూడా కారణమే. జగన్ సర్కార్ దిగిపోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో గతం తాలూకూ దోపిడీ పోతుందని ఆశించిన వారికి నిరాశ తప్పడం లేదు.
దోపిడీదారులు మారారే తప్ప, దోపిడీ మాత్రం యథాతథం. ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో వారం రోజులు మాత్రం దోపిడీకి అడ్డుకట్ట పడినట్టు కనిపించింది. ఆ తర్వాత ఇసుక, ఎర్రమట్టి దోపిడీ షరా మామూలే అన్నట్టుగా తయారైంది. వాటిని దోపిడీ చేయకపోతే ఇంతకాలం కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ఎందుకు కోరుకుంటామని ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. గతంలో కనీసం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనో, అడ్డుకుంటాయనో భయమైనా వుండేది. ఇప్పుడు అది కూడా లేదు.
అధికార పార్టీ పెద్దలు ఎన్ని నీతులు చెప్పినా, క్షేత్రస్థాయిలో వినిపించుకునేవారు, పట్టించుకునే వారు లేరనే చెప్పాలి. ఇలాగైతే ఎన్నికల్లో మీ కోసం మేమెందుకు పని చేశామని వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గతంలో వైసీపీ నాయకులు ప్రకృతి వనరుల్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సంపాదించారని, ఇప్పుడు ఆ పని తాము చేయకుంటే రాజకీయాలు ఎలా చేయాలని వారు నిలదీస్తున్నారు.
రాజకీయాల్లో డబ్బులేనిదే పది మంది మనుషులు వెంట రారని వారు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, ఇంకా అధికార యంత్రాంగం కుదురుకోకపోవడంతో ప్రస్తుతానికి దోపిడీని అడ్డుకునే పరిస్థితి లేదు. ఇదే రీతిలో ప్రకృతి వనరుల్ని కొల్లగొడితే చెడ్డపేరు వస్తుందనే భయంతో చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. భవిష్యత్‌లో ఎలా వుంటుందో చూడాలి.