తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో అనూహ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కారును అడ్డుకుని, అద్దాలు ధ్వంసం చేశారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే గ్రామస్తుల ఆగ్రహానికి కారణమని తెలిసింది. తెలంగాణలో వర్షాలు, వరదలు ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి పోటెత్తింది.
గోదావరి ముంపును పరిశీలించడానికి బీజేపీ ఎంపీ వెళ్లారు. మార్గమధ్యంలో ఎర్దండి గ్రామస్తులు ఎంపీని అడ్డుకుని నిరసన తెలిపారు. గ్రామానికి సంబంధించి వంతెన నిర్మాణ హామీని నిలబెట్టుకోలేదని స్థానికులు మండిపడ్డారు. హామీని నిలబెట్టుకోకుండా గ్రామానికి ఎందుకొచ్చావని ప్రజలు నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు ఎంపీకి మద్దతుగా నిలబడడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గ్రామస్తులను పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి గోదావరి ముంపును పరిశీలించేందుకు ఎంపీకి లైన్ క్లియర్ చేశారు. అయితే తమపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించి తిరుగు ప్రయాణమైన అరవింద్‌ను గ్రామస్తులు తిరిగి అడ్డుకున్నారు.
అరవింద్ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అరవింద్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాగోలా పోలీసులు గ్రామస్తులను అదుపు చేసి, అరవింద్‌ను అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు.