పవన్ విజయావకాశాలపై యూట్యూబ్ చానెళ్ల సర్వేనా?

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణలో వచ్చే ఏడాది, ఆంధ్రాలో ఆ పై ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా…

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణలో వచ్చే ఏడాది, ఆంధ్రాలో ఆ పై ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఈ విషయంలో తెలంగాణలో కేసీఆర్, ప్రతిపక్ష పార్టీల అధినేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సవాళ్లు కూడా విసురుకున్నారు. ఏపీలో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు అప్పుడే అభ్యర్థులను నిర్ణయిచడంలో నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే కదా. సాధారణంగా పోయిన చోటనే వెతుక్కోవాలంటారు పెద్దలు. కానీ పవర్ స్టార్ పోయినచోట కాకుండా వేరే చోట వెదుక్కోవాలని నిర్ణయించుకున్నాట్ట. వచ్చే ఎన్నికల్లో ఆయన తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. 

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌నే యోచ‌న‌లో మొద‌టి నుంచి జ‌న‌సేనాని ఉన్నారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచన పెట్టుకోలేదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి దాదాపు 25 వేల ఓట్ల‌కు త‌క్కువ కాకుండా జ‌న‌సేన సాధించింది. తెలుగుదేశం పార్టీ ఓట‌మిపాలు కావ‌డానికి ఇది కూడా ఒక‌ కార‌ణం. విచిత్రమేమిటంటే …పవన్ విజయావకాశాలపై పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు యూట్యూబ్ ఛాన‌ళ్లు స‌ర్వే నిర్వ‌హించాయి. 

సాధారణంగా సర్వే ఏజెన్సీలు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. కానీ పిఠాపురం నియోజకవర్గంలో యూట్యూబ్ చానెళ్లు సర్వే చేయడం విచిత్రంగా ఉంది. ఈ స‌ర్వేలో స్థానికులంతా ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డి నుంచి పోటీచేసి ఉండాల్సింద‌ని, గెలిపించుకునేవారిమ‌ని చెప్పారట. 2019 ఎన్నిక‌ల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించడం ఉదాహరణగా చెబుతున్నారు. 

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి హ‌వాలో కూడా ఆమె అన్ని ఓట్లు సాధించ‌డం అద్భుతంగా పరిగణిస్తున్నారు. పిఠాపురంలో జ‌న‌సేన బ‌లోపేతంగా ఉందంటున్నారు. వార్డు వార్డుకు, గ్రామ గ్రామానికి కార్య‌క‌ర్త‌ల యంత్రాంగం ఉందట. యువ‌త ఆయ‌న‌వైపే ఉంటారు కాబ‌ట్టి విజ‌యానికి ఢోకా లేద‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డి ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవ‌సం చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తే ప‌రిస్థితి ఏమిటి? అనే విషయం తెలుసుకోవ‌డానికే యూట్యూబ్ ఛానెళ్ల‌తో స‌ర్వే నిర్వ‌హింప‌చేసిన‌ట్లుగా భావిస్తున్నారు. పిఠాపురం నుంచి గెలిచి పవన్ అసెంబ్లీలో అడుగుపెడతాడా?