వారెవ్వా.. ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తుకు ఫీజులు!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే ఉంటాయి. కానీ, కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందే. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో ఈసారి తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అనే నమ్మకంతో రాజకీయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఫీజులు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గదు గానీ.. పార్టీకి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని.. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకుని.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటోంది. సెప్టెంబరు నెలలోనే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించాలని కాంగ్రెస్ అనుకుంటోంది. త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వలన ఎడ్వాంటేజీ ఉంటుందని వారు భావిస్తున్నారు. అభ్యర్థులకు ప్రచారంలో దూసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందని అనుకోవడంతో పాటు, నియోజకవర్గాల్లో అసంతృప్తులు తలెత్తితే వాటిని బుజ్జగించడానికి కూడా వ్యవధి ఉంటుందని పార్టీ భావిస్తోంది. సెప్టెంబరులో తొలి జాబితా వచ్చేందుకు వీలుగా, ఆగస్టు 15 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

దరఖాస్తులకు రుసుములను కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ కోరే వ్యక్తి ఓసీ అయితే పదివేలు, బీసీలు అయిదువేలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 2500 రూపాయలు రుసుము చెల్లించి అప్లికేషన్ వేసుకోవాలి. స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఫీజులు ఇవి ఫైనల్ కాదుట. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ తుది ఫీజులను నిర్ణయిస్తుందిట. ఓసీ అభ్యర్థులు యాభై వేలు, బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు 25 వేల రూపాయల వంతున రుసుములు నిర్ణయించాలని భావిస్తున్నారట. 

ఇలా అప్లికేషన్లకు రుసుములు పెట్టడం వల్ల పార్టీకి కొంత డబ్బు సమకూరుతుంది. కానీ రుసుముల వల్ల అప్లికేషన్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఏమీ ఉండదు. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారిలో పాతిక, యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టలేని వారు ఎవరూ ఉండరు. పైగా డబ్బు కూడా కడుతున్నాం కాబట్టి.. ఇంకా అధికారంతో టికెట్ డిమాండ్ చేయడానికి వారు సిద్ధం కావొచ్చు.

సాధారణంగా పార్టీలు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్న వారిని ఓసీలైతే కనీసం ఇరవైకోట్లు, ఇతర వర్గాల వారైతే పది కోట్లు తమ వద్ద సొమ్ములు నిల్వ ఉన్నట్టుగా, ఆ మేరకు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్నట్టుగా రుజువులు చూపించమని అడుగుతుంటాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులకు ఫీజులతో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.