రియల్ ఎస్టేట్ విషయంలో సామాన్యుడి భయాలు

సామాన్యుడికి కూడా రియలెస్టేట్ కలలుంటాయి. కోట్లు పోసి ఎకరాల్లెక్కన కొనలేకపోయినా కొన్ని లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం ఊరి సివార్లల్లో ఏదో ఒక వెంచర్లో స్థాలాలు కొంటుంటారు. రియాల్టర్లు కూడా తమ వెంచర్ పక్కనుంచి…

సామాన్యుడికి కూడా రియలెస్టేట్ కలలుంటాయి. కోట్లు పోసి ఎకరాల్లెక్కన కొనలేకపోయినా కొన్ని లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం ఊరి సివార్లల్లో ఏదో ఒక వెంచర్లో స్థాలాలు కొంటుంటారు. రియాల్టర్లు కూడా తమ వెంచర్ పక్కనుంచి వెళ్లే రోడ్డు వైడెనింగ్ కి మంజూరయ్యిందని, కాస్త దూరంలో ఒక బైపాస్ రోడ్డు రాబోతోందని ఇలా రకరకలుగా చెప్పి మధ్యతరగతి వాళ్లని ఆకట్టుకుంటూ ఉంటారు. పోయిన నెల ఫలానా రేటుకి ఇస్తే ఈ నెల గజానికి ఐదొందలు పెరిగిపోయిందని, ఆలశ్యం చేసిన ఆశాభంగమని కంగారు పెడుతుంటారు. 

అప్పటికే ఈ సామాన్యుడి చుట్టమో, స్నేహితుడో అదే వెంచర్లో పోయిన నెల కొనుంటాడు. అలా తాను కూడా లాభం చూడాలని ఉన్నదంతా పెట్టి స్థలం కొంటాడు. అక్కడి వరకు అంతా బానే ఉంటుంది. ఇక్కడ రియాల్టర్లు చెప్పినవి కూడా అబద్ధాలు కావనుకుందాం. కొత్త రోడ్లు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన అంశాలు వార్తాపత్రికల్లో వచ్చినవే అ రియాల్టర్లు చెప్పారనుకుందాం. 

ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలొస్తాయి. ప్రభుత్వం మారుతుంది. ఆ దెబ్బతో ఈ పాత ప్రకటనలన్నీ నీటి రాతలే అవుతాయి. ఈ పరిస్థితి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశులో ఎక్కువగా ఉంది. 

2014-19 మధ్యన అప్పటి తెదేపా ప్రభుత్వం ఏవో కొన్ని ప్రకటనలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పడబోతున్నాయని, అమరావతి దగ్గర కేపిటల్ రాబోతోందని, ఫలానా చోట ఏవో ఎమ్మెన్సీలొస్తున్నాయని ఇలా…! ఆ వార్తల్ని పట్టుకుని రియాల్టర్లు ఎకరాల్లో ల్యాండులు కొని వాటిని ముక్కలు కొట్టి సామాన్యులకి గజాల్లెక్కన అమ్మారు. ఏడాదిలోనో, రెండేళ్లల్లోనో తమ పెట్టుబడి రెట్టింపవుతుందని కొందరు, ఐదారింతలు అవుతుందని ఇంకొందరు ఇలా కలలుగంటూ కూర్చున్నారు. ఆ ప్రకటించిన ప్రాజెక్టులు తెదేపా కాలంలో మొదలే కానివి చాలా ఉన్నాయి. కేవలం ప్రకటనలు చేసి ఆర్టిఫీషియల్ బూం తెప్పించిన దాఖలాలే ఎక్కువ. 

2019లో వైకాపా ప్రభుత్వం పదవిలోకొచ్చింది. అంతే..తెదేపా ప్రతిపాదించిన ప్రకటనలన్నీ పక్కనపెట్టి కొత్త ప్రకటనలు చేసింది. లేదా తెదేపా పాలనలో చెప్పిన రోడ్లను మందకొడిగా వేస్తూ మరో చోట మరో రోడ్డుకో, గృహాలకో శంకుస్థాపనలు చేసింది. తమ పెట్టుబడులకి రెక్కలొస్తాయని కలలుగన్న సామాన్యులకి కాళ్లు చేతులు పడిపోయినంత పనయ్యింది. కొన్న రేటుకి అమ్ముదామన్నా కొనే నాథుడు లేని పరిస్థితిలో ఉన్న వెంచర్లున్నాయి. 

ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం వల్ల వైజాగులో రియల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. అసలే పెద్ద నగరం, ఆపైన రాజధాని అనే ప్రకటనలు…కలిపి రియలెస్టేట్ ఇక్కడ ఊపందుకుంది. దీనివల్ల ఒక్క వైజాగులోనే కాదు, దాదాపు 30-40 కిమీ రేడియస్ లో నగరం చుట్టూ రియలెస్టేట్ బుసలుకొడుతోంది. వైకాపా ప్రభుత్వం ఉన్నంతవరకు పర్వాలేదు. ఒక వేళ ప్రభుత్వం మారితే అప్పుడొచ్చే ప్రభుత్వం మళ్లీ ఇవన్నీ పక్కనపెట్టి వేరే ప్రకటనలతో వేరే ప్రాంతాల మీద పడొచ్చు. అప్పుడు ఈ వైజాగ్ రేడియస్ లో ఎక్కడో సుదూరంగా కొన్న సామాన్యుడు చతికిలపడొచ్చు. 

ఈ రకంగా ప్రభుత్వాలు తమ రాజకీయ చదరంగంతో సామాన్యులకి కూడా ఆయాసం తెప్పిస్తున్నాయి. ఈ అభిప్రాయాలు బలపడడం వల్ల ఆంధ్రలో స్థలాలపై పెట్టుబడులకంటే హైదరాబాదో, బెంగుళూరో అయితే నయమని ఆ దిశగా పోతున్న జనాభా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా లేదు. 

ఇదంతా సామాన్యుడి రియల్ గాధ. ఇప్పుడు పార్టీ పరంగా ఉన్న వ్యక్తుల గురించి చెప్పుకుందాం. 

ఉదాహరణకి వైకాపాకి చెందిన ఒక వ్యక్తి ఒక ఊరిలో ఒక సినిమాహాలో, కళ్యాణమండపమో కట్టుకున్నాడనుకుందాం. తెదేపా పదవిలోకొస్తే ఆ ప్రాపర్టీని లాక్కునే క్రమంలో హరాస్మెంట్లు చేయొచ్చు. ప్రభుత్వం తలచుకుంటే ఏ లొసుగుని పట్టుకుని ఏదైనా చేయొచ్చు. చాలా ఏళ్ల క్రితం బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గరున్న ఒక ప్రైవేటు స్థలాన్ని, అందులోని బిల్డింగుని ఒక పత్రికా యజమాని అప్పటి తెదేపా అండతో ఎలా కబ్జాచేసి లాగేసుకున్నాడో అక్కడ చెప్తారు. అది ముమ్మాటికీ కబ్జానే. అలాగే వైకాపా ప్రభుత్వంలో కొందరు తెదేపా వాళ్ల ఇళ్లని ఎంక్రోచ్మెంట్ జరిగినందువల్ల ఎలా కూలగొట్టారో చూసాం. 

ఈ రకంగా ఆంధ్రలో కబ్జాలు, కూల్చివేతలు, ఒక పార్టీ చేసిన ప్రకటనలు మరొక పార్టీ అధికారంలోకి వస్తే పక్కనపెట్టడాలు…ఇలాంటి వాతావరణం కారణంగా సామాన్యుడి నుంచి ధనిక రియాల్టర్ల వరకూ ఎవ్వరూ పెద్దగా ఆంధ్రలో రియలెస్టేట్ కి ఇవ్వాల్సిన ఊపునివ్వడం లేదు. ఎవరి భయాలు, అనుమానాలు వాళ్లకున్నాయి. 

రాజకీయం పైకి రెండు పార్టీల మధ్యనే జరుగుతుందనిపించినా మధ్యలో సామాన్యుడి పెట్టుబడులు నలగడం, రాష్ట్రంలోకి రావాల్సిన రియల్ పెట్టుబడులు రాకపోవడం రెండూ జరుగుతున్నాయి. 

2024 ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ పదవిలోకిచ్చిన ఈ కక్షసాధింపులు వగైరాలు పక్కనపెట్టి సర్వతో ముఖాభివృద్ధి దిశగా అడుగువేసినప్పుడే రాష్ట్రంలో రియల్ బూం, పర్యవసానంగా సంబంధిత అభివృద్ధి అన్నీ జరగడానికి ఆస్కారముంటుంది. ఆ వాతావరణం చూస్తామని ఆశిద్దాం.

– శ్రీనివాసమూర్తి