వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కష్టానికి ప్రతిఫలంగా ఉండబోతోందా! ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుని పోరాడుతూ, ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అంటూ రాజకీయ పయనాన్ని సాగిస్తున్నప్పటికీ, తెలంగాణ రాజకీయంలో ఇంకా గట్టిగా ఉనికిని చాటుకోలేనప్పటికీ.. షర్మిల తన వరకూ అయితే ఒక అవకాశాన్ని సంపాదించుకోనుందా! తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టి షర్మిల అధ్యక్ష.. అనే అవకాశాలున్నాయా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు! తెలంగాణ రాజకీయంలో అపసోపాలు పడుతున్న షర్మిల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నట్టున్నాయి. అందుకు ఒక నియోజకవర్గం పరిణామాలు కూడా కలిసి వచ్చే అవకాశాలను ఇస్తున్నాయి.
పార్టీ పెట్టడంతోనే షర్మిల తెలంగాణలోని ఖమ్మం జిల్లా మీదే టార్గెట్ పెట్టుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచి తెలంగాణ వాదుల కన్నా ఇతరులనే బాగా ఆదరించింది. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో కూడా ఆంధ్రా పార్టీలు అని టీఆర్ఎస్ చేత అనబడే పార్టీలే సత్తా చూపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ సీటుతో సహా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను నెగ్గింది. ఆ తర్వాత వారంతా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మంలో గెలిచిన వారు కూడా జై కేసీఆర్ అన్నారు! ఖమ్మం జిల్లాలో ఇలా వేరే పార్టీ ల ద్వారా గెలిచి వచ్చిన వారిని చేర్చుకుంటూ టీఆర్ఎస్ వాటిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇలా టీఆర్ఎస్ ఎన్ని చేసినప్పటికీ ఖమ్మంపై పూర్తి స్థాయిలో పట్టు దక్కలేదు. ఇతర పార్టీలు ఉనికిని ఏదోలా చాటుకుంటూనే ఉన్నాయి.
సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఖమ్మం జిల్లాపై షర్మిల దృష్టి ఉంది. ప్రత్యేకించి పాలేరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుందనే వార్తలూ వస్తూనే ఉన్నాయి. పోటీ చేయడానికి అయితే ఆమెకు అది అనుకూల నియోజకవర్గమే కానీ, గెలవగలదా? అనేది మాత్రం సహజంగా ప్రశ్నగానే మిగిలింది!
నిజాలు చెప్పుకుంటే తెలంగాణలో షర్మిల రాజకీయ పయనం అంతగొప్పగా ఏమీ లేదు. ఈ సుదూర పాదయాత్రికురాలు తెలంగాణలో చిన్నపాటి సమూహాన్ని వేసుకుని నడుస్తూ ఎందుకు నడుస్తోందో అనేంత సందేహాలను జనింపజేస్తోంది. మరి రాష్ట్ర వ్యాప్త పోటీకి షర్మిల పార్టీ కి పట్టు లేదని స్పష్టం అవుతోంది. ఏవో ఒకటీ రెండు ఉప ఎన్నికలు వచ్చినా, వాటిల్లో కనీసం అభ్యర్థిని పెట్టలేకపోయారు షర్మిల. ఒకవేళ పోటీ చేసి ఉంటే, అతి తక్కువ ఓట్లు వచ్చి పరువుపోయేదేఏమో! ఇలా ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ షర్మిల రాజకీయంగా మరింత పలుచన అయ్యారు. పార్టీ పెట్టాకా పోటీ చేయాలి, లేకపోతే షర్మిల అయినా, పవన్ కల్యాణ్ అయినా విమర్శలకే మరింత అవకాశం ఇస్తారు!
అదలా ఉంటే.. పాలేరు నియోజకవర్గ పరిణామాలు మాత్రం షర్మిలకు అనుకూలంగా ఉన్నట్టున్నాయి. మొదటి నుంచి పాలేరు కాంగ్రెస్ కు కంచుకోట లాంటిదే! 2016 లో జరిగిన ఒక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నెగ్గింది. ఇక గత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జై కొట్టారు స్థానికులు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నిలబడినా, కాంగ్రెస్ అభ్యర్తి కందాల ఉపేంద్ర రెడ్డి విజయం సాధించారు. ఇలా ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పట్టు నిలబడింది.
అయితే ఎమ్మెల్యేగా గెలిచాకా ఉపేంద్ర రెడ్డి టీఆర్ఎస్ పంచన చేరారు. ఇది స్థానిక కాంగ్రెస్ క్యాడర్ కు బాగా నిరుత్సాహాన్ని కలిగించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సహజమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ సంప్రదాయ ఓటు బ్యాంకు తమ ఎమ్మెల్యే అధికారం లేకపోయినా ఫర్వాలేదు, కానీ కాంగ్రెస్ అయితే చాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఇలా టీఆర్ఎస్ లోకి చేరిపోవడాన్ని వారు సహించడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎవరు నెగ్గినా వారికి ఆదరణ ఉండకపోవచ్చు.
ఇదే సమయంలో ఎవరైనా కాంగ్రెస్ తరఫున నిలబడ్డారని జనాలు ఓటేసినా, వారు టీఆర్ఎస్ వైపు చేరిపోనూ వచ్చు! అందుకే ఈ కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు షర్మిల గనుక ఇక్కడ పోటీ చేస్తే ఆమెకు జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను గెలిపిస్తే వారు టీఆర్ఎస్ లోకి జంప్ అయిపోతున్న నేపథ్యం లో .. వైఎస్ తనయ వైపే స్థానికులు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.