దొర‌ల్ని తిట్టి .. మ‌ళ్లీ అదే దొర‌ల పార్టీలోకే ఉమ‌!

తుల ఉమ.. ఇటీవ‌ల వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. బీజేపీ త‌ర‌పున ఆమె వేముల‌వాడ టికెట్‌ను మూడో జాబితాలో ద‌క్కించుకున్నారు. బీజేపీ నాలుగో జాబితాలో మాత్రం ఆమెకు బ‌దులు వికాస్‌రావు పేరు వుంది. దీన్ని ఆమె…

తుల ఉమ.. ఇటీవ‌ల వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. బీజేపీ త‌ర‌పున ఆమె వేముల‌వాడ టికెట్‌ను మూడో జాబితాలో ద‌క్కించుకున్నారు. బీజేపీ నాలుగో జాబితాలో మాత్రం ఆమెకు బ‌దులు వికాస్‌రావు పేరు వుంది. దీన్ని ఆమె జీర్ణించుకోలేక‌పోయారు. వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు కుమారుడే వికాస్‌రావు. తాను బీసీ కావ‌డంతోనే బీజేపీ నేత‌లు అన్యాయం చేశార‌ని ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు బండి సంజయ్ బీఫామ్‌ను వెల‌మ దొర‌ల కాళ్ల వ‌ద్ద పెట్టార‌ని ఉమ విరుచుకుప‌డ్డారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి దొర‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌లో కూడా ఒక దొర త‌న‌ను అణ‌చివేయాల‌ని చూశార‌ని, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పార్టీ నుంచి బ‌య‌టికొచ్చాన‌ని తుల ఉమ గుర్తు చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

చివ‌రికి ఆమె దొర‌ల పార్టీగా ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌లో చేర‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఏ దొర‌లకు వ్య‌తిరేకంగా పోరాడాన‌ని చెప్పారో, ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గం నేతృత్వం వ‌హిస్తున్న బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోవ‌డం ఏంట‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. 

ఇవాళ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో తుల ఉమ బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీకి రాజీనామా సంద‌ర్భంగా ఆ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.